టీవీఎస్, డ్యూక్, బజాజ్ బైక్‌లకు యమహా సవాల్: సరికొత్త మోడల్‌తో మార్కెట్లోకి
యమహా ఇండియా మోటార్ బైక్స్ సంస్థ నూతనంగా భారత మార్కెట్లోకి ఎంటీ - 15 బైక్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1.36 లక్షలుగా నిర్ణయించారు. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200, కేటీకే 125 డ్యూక్, బజాజ్ పల్సర్ బైక్‌లతో తలపడనున్నది.
న్యూఢిల్లీ: ఇండియా యమహా మోటార్ దేశీయ మార్కెట్లోకి 155 సీసీ ఇంజన్ సామర్థ్యం గల ఎంటీ-15 బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1.36 లక్షలుగా నిర్ణయించారు.
లిక్విడ్ కూల్డ్ ఫోర్ స్ర్టోక్ ఇంజన్, సిక్స్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్, సింగిల్ చానల్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), 6- స్పీడ్ ట్రాన్స్‌మిషన్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ వేరియేబుల్ వాల్వ్ యాక్చువేషన్ (వీబీఏ) వంటి ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.
భారత్‌లో మోటార్ సైకిలింగ్‌లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రైడర్లు స్పీడ్‌తోపాటు కంట్రోల్స్ ఉండే బైక్‌లను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఎంటీ-15’ను మార్కెట్లోకి తెచ్చామని యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మోటోఫుమి షితారా తెలిపారు.
మెటాలిక్ బ్లాక్, డార్క్ మ్యాట్ బ్లూ కలర్స్‌లో ఇది లభ్యం కానుంది. అలాగే ట్యాంక్ ప్యాడ్, సీట్ కవర్, మొబైల్ హౌల్డర్, పోలో షర్ట్స్, స్టికర్, కీ రింగ్ లాంటి యాక్సెసరీస్ ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే యమహా మోటార్స్ ఎంటీ-09ను విక్రయిస్తోంది.
ఈ ఏడాది ఎంటీ సిరీస్‌లో దాదాపు 60 వేల బైక్‌లను విక్రయించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్ల యమహా మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర సింగ్ తెలిపారు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఎంటీ-03 లాంటి బైక్‌లను కూడా భారత్‌లోకి తీసుకురావాలని తాము యోచిస్తున్నట్టు తెలిపారు.
భారత్‌లో ఇప్పటి వరకు ఎంటీ-09 మోడల్ బైక్‌ను మాత్రమే విడుదల చేసింది. 2015 నుంచి ఈ మోడల్ విక్రయాలు కొనసాగుతున్నాయి. దాని తర్వాత మళ్లీ ఎంటీ సిరీస్‌లో ఇప్పుడు ఎంటీ-15 బైక్‌ను తీసుకొచ్చింది.
యమహా ఎంటీ -15 బైక్ 19.3 పీఎస్, 14.7 ఎన్ఎం పీక్ టార్చ్, 155.1 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఈ బైక్‌కు మార్కెట్లో పోటీగా ఉన్న పల్సర్ ఎన్ఎస్ 200, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ మోడల్ బైక్‌లు 23.8 పీఎస్, 18.8 ఎన్ఎం టార్చ్ , 21 పీఎస్, 18 ఎన్ఎం టార్చ్ కలిగి ఉన్నాయి.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ మోడల్ బైక్ మాత్రమే 5 స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంది. మిగతా బైక్‌లన్నీ 6-స్పీడ్ గేర్ బాక్స్ లు కలిగి ఉన్నాయి. కేటీఎం 125 డ్యూక్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 మోడల్ బైక్‌లతో యమహా ఎంటీ - 15 బైక్ తల పడనున్నది.