పలు ఆటోమొబైల్ సంస్థల్లో మూడు దశాబ్దాలుగా కీలక భూమిక పోషించిన వినోద్ కే దాసరి తాజాగా ప్రముఖ మోటార్ బైక్స్ తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమితులయ్యారు.

దాని పేరెంట్ సంస్థ ఐషర్‌ మోటార్స్‌లోనూ డైరెక్టర్‌గా ఉంటారు. వినోద్ కే దాసరి నియామకం వెంటనే అమల్లోకి వచ్చిందని సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు, దాసరిని ఈసీఓగా నియమించామని, సిద్ధార్థ లాల్‌ ఐషర్‌ మోటార్స్‌ ఎండీగా కొనసాగుతారు’ అని సంస్థ వివరించింది.

ఇప్పటి వరకు రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓగా పని చేసిన సిద్ధార్థ లాల్ ఇక మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. భారత్‌ నుంచి అంతర్జాతీయ బ్రాండ్‌గా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ను తీర్చిదిద్దడం సవాలుగా తీసుకున్నానని వినోద్ కే దాసరి పేర్కొన్నారు.

వినియోగదారు బ్రాండ్లలో పనిచేయడం వల్ల నేర్చుకోడానికి ఎంతో ఉపకరిస్తుందన్నది తన అభిప్రాయం అని చెప్పారు. ఫెంటాస్టిక్ బ్రాండ్‌గా రాయల్ ఎన్ ఫీల్డ్‌ను తీర్చిదిద్దేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ బైక్స్‌ది స్ఫూర్తిదాయక గాథ అని పేర్కొన్నారు.  

2005లో అశోక్‌ లేలాండ్‌ సీఈఓగా చేరిన దాసరి, 2011 నుంచి ఆ సంస్థకు ఎండీగా కూడా వ్యవహరించారు. ఇటీవలే రాజీనామా చేశారు. 2015-17 సంవత్సరాలలో వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 2013-15లో వాహన పరిశోధనా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు.

1986లో జనరల్ మోటార్స్ కోలో ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. బిజినెస్ విజన్, సిబ్బంది నైపుణ్యాలను కలగలిపి చూసిన ఎగ్జిక్యూటివ్ వినోద్ కే దాసరి. అశోక్ లేలాండ్ సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని సిద్ధార్థ లాల్ తెలిపారు.

250 -750 సీసీ సామర్థ్యం గల బైక్‌ల విభాగంలో రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థకు నాయకత్వం వహించే వారు అవసరం అని చెప్పారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాయల్ ఎన్ ఫీల్డ్ భారతదేశంలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టనున్నదని ఐషర్ మోటార్స్ తెలిపింది.

బీఎస్ -6 నిబంధనల అమలు దిశగా రాయల్ ఎన్ ఫీల్డ్ చర్యలు తీసుకుంటుంది. ఈ ఏడాది 9.50 లక్షల బైక్ లను ఉత్పత్తి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ మార్కెట్లలో పాగా వేసేందుకు చర్యలు చేపట్టిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ లాల్ తెలిపారు. ఏషియాన్ దేశాల్లో మార్కెట్ బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.