న్యూఢిల్లీ: ‘స్ప్లెండర్’, ‘ఫ్యాషన్’ తదితర విభిన్నమైన పేర్లతో మోటారు బైక్‌లు యువత ముంగిట్లోకి వచ్చాయి. వాటిని భారతదేశంలో సగటు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చేరువ చేసిన ఘనత హీరో మోటో కార్ప్స్.. అందునా కంపెనీ చైర్మన్ పవన్ ముంజాల్ సొంతం అంటే అతిశయోక్తి కాదు. 

హీరో మోటో కార్ప్స్ సంస్థ విపణిలోకి తీసుకొచ్చిన బైక్‌లు దేశీయ మోటారు సైకిళ్ల చరిత్రనే తిరగ రాశాయి. హీరో మోటో కార్ప్స్ అంతకుముందు హోండా సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ నడిపించాయి. కానీ భాగస్వామ్య సంస్థ హోండా దూరమైన తర్వాత అందరూ హీరో మోటో కార్ప్స్ కోలుకోలేదని భావించారు. 

also read పతనమైన వృద్ధి.. కొరవడిన డిమాండ్.. కొండెక్కుతున్న కొలువులు

కానీ ఆ అంచనాలకు భిన్నంగా విజయగర్వంతో సగౌరవంగా హీరో మోటో కార్ప్స్ ముందుకు దూసుకు వెళుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో కష్టాల నుంచి హీరో మోటో కార్ప్స్ సంస్థను సునాయసంగా బయటపడేసిన ఘనత కంపెనీ చైర్మన్ పవన్ ముంజాల్‪కే దక్కింది మరి. 

సైకిళ్ల విడి భాగాలతో ‘హీరో మోటో కార్ప్స్’ ప్రస్థానం మొదలైంది. సంప్రదాయ కూరగాయల వ్యాపారం నుంచి సైకిళ్లు.. తర్వాత మోటారు సైకిళ్ల వ్యాపారం వైపు కుటుంబాన్ని నడిపించిన ఘనత ముంజాల్ సోదరుల్లో పెద్దవాడు బ్రిజ్ మోహన్ లాల్‌కే దక్కుతుంది. తొలుత ‘హీరో’ పేరిట సైకిల్ విడి భాగాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. 

1971 నాటికి రిమ్ మేకింగ్ డివిజన్ లోకి అడుగు పెట్టి.. ఆనతి కాలంలోనే భారతదేశంలోనే అతిపెద్ద సైకిల్ తయారీ కంపెనీగా హీరో రూపుదిద్దుకున్నది. తర్వాత మేజెస్టిక్ ఆటో పేరిట మోపెడ్ తయారీ.. అందులోనూ విజయం సాధించడంతో 1980వ దశకంలో భారతదేశ ద్విచక్ర వాహన రంగంలో హీరో గ్రూప్ కీలకంగా మారింది. 

1980వ దశకంలో జపాన్ ఆటోమొబైల్ సంస్థ హోండాతో జత కట్టడంతో హీరో మోటో కార్ప్స్ రూపమే మారిపోయింది. భారత రోడ్లపై స్కూటర్లు రాజ్యమేలుతున్నవేళ ‘హీరో హోండా’ చేసిన ప్రయత్నం ఫలించింది.. ఏనాటికైనా మోటారు సైకిల్ కొనాలన్న మధ్య తరగతి ప్రజల కలను సాకారం చేసిందీ ఈ సంస్థ. ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తూ ఈనాడు దేవంలోని అతిపెద్ద మోటారు సైకిళ్ల తయారీ సంస్థల్లో ఒక్కటిగా రూపుదిద్దుకున్నది. 

హీరో కంపెనీని స్థాపించిన పటిష్ఠ పునాదులు వేసిన బ్రిజ్ మోహన్ లాల్ మూడో కుమారుడే ప్రస్తుత హీరో మోటో కార్ప్స్ చైర్మన్ పవన్ ముంజాల్. 1954 అక్టోబర్ 29వ తేదీన పంజాబ్ రాష్ట్రం లుధియానాలో జన్మించిన పవన్ ముంజాల్ ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే సాగింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కురుక్షేత్ర నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులో పట్టా పొందారు.

మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన పవన్ డైరెక్టుగా వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. ‘మేజెస్టిక్ ఆటో’తో వ్యాపార ప్రస్థానానికి నాంది పలికారు. 1984లో టెక్నాలజీ దిగుమతికి ప్రభుత్వం అనుమతించడంతో హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థతో జత కట్టేందుకు వీలు కలిగింది. ఈ జాయింట్ వెంచర్‌లో పవన్ సలహాలు కంపెనీకి ఎంతో ఉపకరించాయి.

కొడుకు పవన్ ముంజాల్ వ్యాపార నైపుణ్యాన్ని బ్రిజ్ మోహన్ లాల్ గమనించారు. ఢిల్లీకి పంపాలని నిర్ణయించడంతో ‘హీరో హోండా’లో పవన్ కీలకంగా వ్యవహరించడం మొదలైంది. 2001లో చైర్మన్ గా పవన్ ముంజాల్ బాధ్యతలు స్వీకరించే నాటికి ‘హీరో హోండా’ దేశంలోనే అగ్రగామి మోటారు సైకిళ్ల సంస్థగా నిలిచింది. 2008 ఆర్థిక సంక్షోభం వేళ కూడా 44 లక్షల బైక్ లు విక్రయించి తన సత్తా ఏమిటో రుజువు చూసుకున్నది. 

భారత దేశంలో ద్విచక్ర వాహన రంగానికి గల భవిష్యత్‌పై సరైన అంచనాతో ఉన్న పవన్ ముంజాల్ తన ఆలోచనలకు పదును పెట్టారు. యువత ఆలోచనలను పసిగట్టేవారు. కంపెనీ లక్ష్యాల్ని నిర్దేశించే వారు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మార్కెట్ ట్రెండ్ తెలుసుకుని కంపెనీ లక్ష్యాలను నిర్దేశించే వారు. అలా వచ్చినవే స్ప్లెండర్. ఫ్యాషన్, ఫ్యాషన్ ప్లస్ మోడళ్లు. 

వీటి రాకతో భారత ద్విచక్ర వాహన రంగంలో నూతన చరిత్ర మొదలైందనడంలో ఎటువంటి సందేహం లేదు. వినియోగదారులను ఆకట్టుకోవడంతో కంపెనీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. యువతను ఆకర్షించడానికి వీరేంద్ర సెహ్వాగ్, ఇర్పాన్ పఠాన్, హ్రుతిక్ రోషన్, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులను బ్రాండ్ అంబసిడార్లుగా ఎంచుకుని మార్కెట్లో క్రేజ్ తెచ్చారు.

also read ల్యాండ్ రోవర్ నుంచి రేంజ్ రోవర్ ఎవోక్ కొత్త వెర్షన్.... అదిరిపోయే టెక్నాలజి ఫీచర్స్....

27 సంవత్సరాల బంధానికి స్వస్తి పలుకుతూ 20111 మార్చిలో హీరోతో హోండా తెగదెంపులు చేసుకోవడంతో హీరో పనై పోయిందనుకున్నారు. కానీ మళ్లీ పవన్ ముంజాల్ తన ఆలోచనలకు పదును పెట్టారు. కొత్తతరం వినియోగదారులను ఆకట్టుకునేందుకు పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశాన్ని అవసరాన్ని గుర్తించారు. వివిధ దేశాల పరిశోధనా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 

ఇటలీకి చెందిన ఇంజినీరింగ్, ఆస్ట్రియా ఏవీఎల్, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ కోసం ఇటలీ మాగ్నెటీ మారెల్లి సంస్థతో జత కట్టారు. కంపెనీని తిరిగి అగ్ర పథాన నిలపాలంటే భౌగోళిక విస్తరణ అవసరమని భావించారు. ఇస్తాంబుల్, ఎల్ సాల్వేడార్, బంగ్లాదేశ్, బొగోటా, బోలొగోనా, నైరోబీ, లిమా, సావో పాలో వంటి మార్కెట్లను ఒడిసి పట్టి లాటిన్ అమెరికా దేశాల్లో తనదైన ముద్ర వేసి హీరో కంపెనీకి తనదైన శైలిలో రూపొందించిన వ్యూహ రచనతో పూర్వ వైభవం తీసుకొచ్చారు.