విపణిలోకి జమోపాయి ‘ది ఆస్ట్రిడ్ లైట్’ విద్యుత్ స్కూటర్.. ధరెంతంటే?!


న్యూఢిల్లీ: గోరీన్‌ ఈ మొబిలిటీ, ఓపై ఎలక్ట్రానిక్‌ సంయుక్త సంస్థ ‘జమోపాయ్ ఎలక్ట్రిక్‌’ భారతదేశంలో 'ది ఆస్ట్రిడ్‌ లైట్‌' పేరుతో విద్యుత్  స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ.79,999గా నిర్ణయించింది. అదే సమయంలో కంపెనీ ప్రారంభ ఆఫర్లనూ ప్రకటించింది. 

ఈ స్కూటర్‌లో 2,400 వాట్స్‌ విద్యుత్ మోటార్‌ ఉంది. 1.7కిలోవాట్‌ లిథియం అయాన్‌ బ్యాటరీని అమర్చారు. ఒక సారి చార్జింజ్‌ చేసే డ్రైవింగ్‌ కండిషన్లను బట్టి 75-90 కిలోమీటర్ల మధ్య మైలేజీని ఇస్తుంది. ఈ స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు. 

జమోపాయ్ ‘ది ఆస్ట్రిడ్ లైట్’ స్కూటర్‌లో సిటీ, స్పోర్ట్స్‌, ఎకానమీ అనే మూడు మోడ్‌లు ఉన్నాయి. దీనిలో ఆదనపు బ్యాటరీ అమర్చుకునే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఇది ఏకధాటిగా 150-180 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 

ఈ స్కూటర్‌ నియాన్‌, డీప్‌ ఇండిగో, ఫైరీ రెడ్‌, బ్రంట్‌ చార్‌కోల్‌, ఫైర్‌బాల్‌ ఆరెంజ్‌ అనే ఐదు రంగుల్లో లభిస్తోంది. వచ్చేనెల మొదటి వారం నుంచి ఈ స్కూటర్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి. 

ఈ స్కూటర్ల విడుదల సందర్భంగా జెమోపాయ్ సహవ్యవస్థాపకుడు అమిత్‌ రాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ 'స్టైల్‌, అనుభవం, పనితీరును మేళవించిన ఈ స్కూటర్‌‌గా తీర్చిదిద్దాం. ఇది పర్ఫెక్ట్‌ సిటీ స్కూటర్‌గా రాణిస్తుంది. దీని ధరల ప్రకారం ఇప్పుడు మార్కెట్లో ఉన్న విద్యుత్ స్కూటర్లలో ఇదే వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంది' అని అన్నారు.