విపణిలోకి బీఎండబ్ల్యూ బైక్స్: ఆన్‌లైన్ సేల్స్‌లోకి మరికొన్ని...
జర్మనీ విలాసవంతమైన కార్లు, వాహనాల తయారీ సంస్థ అనుబంధ బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటరాడ్ తాజాగా విపణిలోకి రెండు మోటారు సైకిళ్లను విడుదల చేసింది. మరోవైపు జాగ్వార్ లాండ్ రోవర్, నిస్సాన్ ఇండియా, ఎంజీ మోటార్స్ సంస్థలు భౌతిక (సామాజిక) దూరం నిబంధన పాటించడానికి ఆన్ లైన్ విక్రయాల బాట పట్టాయి.
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ వెహికల్ కంపెనీ బీఎండబ్ల్యూ తన అనుబంధ బీఎండబ్ల్యూ మోటోరాడ్ రెండు మోటారు సైకిళ్లను విడుదల చేసింది. ఎఫ్ 900, ఎఫ్ 900 ఎక్స్ఆర్ పేరుతో వీటిని భారతదేశ విపణిలో ఆవిష్కరించింది.
ఢిల్లీ షోరూములో వీటి ధరలను రూ.9.9 లక్షలు, రూ.11.5 లక్షలుగా నిర్ణయించారు. ఎఫ్ 900 బైక్ ధర రూ.9.9 లక్షలుగా, ఎఫ్ 900 ఎక్స్ఆర్ మోడల్ మోటారు సైకిల్ ధర రూ.11.5 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా ఇవి బీఎండబ్ల్యూ మోటరాడ్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ బైకుల్లోని 895 సీసీ ట్విన్ సిలిండర్ ఇన్ లైన్ ఇంజన్ 105 హార్స్పవర్ విడుదల చేస్తుంది. కేవలం 3.6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
కరోనా వైరస్ నేపథ్యంలో పలు వాహన సంస్థలు ఆన్ లైన్ బుకింగ్ సదుపాయాన్ని తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి. బుకింగ్ నమోదు చేసుకోవడంతోపాటు వాహనం కొనుగోలు ప్రక్రియను కూడా ఆన్ లైన్ లోనే పూర్తి చేసే వ్యవస్థను రూపొందించామని నిస్సాన్ ఇండియా తెలిపింది.
also read మనసు దోచేస్తున్న హ్యుండాయ్ వెర్నా సరికొత్త వెర్షన్.. మారుతి, స్కోడా కార్లతో పోటీ.. ...
ఎస్‌యూవీ కిక్స్, డాట్సన్ శ్రేణి కార్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చునని నిస్సాన్ ఇండియా తెలిపింది. వర్చువల్ షోరూమ్ ద్వారా వినియోగదారులకు షోరూమ్ అనుమతిని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు.
టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సంస్థ తమ అమ్మకాలు, సర్వీసింగ్ తదితర సేవలను ఆన్‌లైన్‌కు అనుసంధానించినట్లు తెలిపింది. ఇప్పటికే ఆన్ లైన్ విక్రయాలు సాగిస్తున్న జాగ్వార్ లాండ్ రోవర్.. తాజాగా తదనంతర సేవలను ప్రారంభించింది.
ఎంజీ మోటార్స్ కాంటాక్ట్ రహిత విక్రయాలు, విక్రయానంతర సేవలను ‘ఎంజీ షీల్డ్ ప్లస్ పేరిట చేపడుతున్నట్లు ప్రకటించింది. కాంటాక్ట్ లెస్ నాలెడ్జ్, ఇంటి వద్దకే వినియోగదారుడికి కారు డెలివరీ ప్రక్రియ వంటి అంశాలపై ద్రుష్టి కేంద్రీకరించామని ఎంజీ మోటార్స్ ఇండియా తెలిపింది. ఇప్పటికే హ్యుండాయ్ మోటార్స్ ఇండియా, మారుతి సుజుకి, టాటా మోటార్స్ సంస్థలు ఆన్ లైన్ సేల్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.