గిఫ్ట్ ఓచర్లు.. గ్రైండర్లు.. బైక్స్ డీలర్స్ ఆఫర్స్ ఇలా
తొమ్మిది నెలలుగా ఆటోమొబైల్ సంస్థలు కార్ల విక్రయాలు పడిపోయి దిగాలు పడ్డాయి. ద్విచక్ర వాహనాల సంస్థలు నాలుగు నెలలుగా సేల్స్ పతనమై ఇబ్బందుల పాలవుతున్న వేళ ప్రస్తుతం మోటారు బైక్ సంస్థల డీలర్లు వినియోగదారులకు పలు రకాల ఆఫర్లు, గిఫ్ట్ ఓచర్లు, రాయితీలు అందిస్తున్నారు.
ప్రతి పండుగకు మోటారు సైకిళ్లు, స్కూటర్ల షోరూంలు ఏదో ఒక రూపంలో ఆఫర్లు ఇస్తూనే ఉంటాయి. వాటిల్లో దసరా ఆఫర్లు వెరీ స్పెషల్‌గా ఉంటాయి. సాధారణంగా దసరాకు ఎక్కువమంది ఇంట్లోకి గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర గ్రుహోపకరణ వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని గృహోపకరణాల, ద్విచక్ర, కార్ల షోరూంలు తమ వస్తువుల విక్రయానికి సిద్ధం అయ్యాయి. ఆఫర్ల మోత మోగిస్తున్నాయి. దీపావళి వరకు ఈ ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఈ మధ్య ఆన్‌లైన్ మార్కెట్‌లోనూ దసరా ఆఫర్ల జోరు పెరిగింది.
దసరా పండుగ సందర్భంగా దాదాపు అన్ని ద్విచక్ర వాహన ఏజన్సీలు వివిధ ఆఫర్లను ప్రకటించాయి. సాధారణంగా కంపెనీలు, ఏజన్సీలు కలిసి ఈ ఆఫర్లను అందిస్తాయి. ఉత్తర భారతదేశంలో దీపావళికి ఎక్కువ అమ్మకాలు ఉంటాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు దీపావళికి ఆఫర్లు అందిస్తాయి. అందువల్ల ఏజన్సీలే ప్రస్తుతం ఆఫర్లు ప్రకటించాయి. హోండా షో రూంలలో రూ.5000 గ్రైండర్‌తోపాటు రూ.7000 గిఫ్ట్ ఓచర్‌ను అందిస్తూ ఒక్క యూనికార్న్ తప్ప మిగతా వాటిపై రూ.12 వేల వరకు తగ్గింపును ప్రకటిస్తున్నాయి.
ఇవి కాక తక్కువ డౌన్ పేమెంట్లు, తక్కువ వడ్డీ రేట్లను షోరూంను బట్టి ప్రకటించాయి. హీరో కంపెనీ షోరూంలు కూడా ఎక్కువగా గ్రైండర్‌ను గిఫ్ట్‌గా ప్రకటిస్తున్నాయి. బజాజ్ కంపెనీ తన అన్ని ఉత్పత్తులపై రూ.2000 నుంచి రూ.3,500 వరకు తగ్గింపు ధరలను అందిస్తోంది.
బజాజ్ డామినియర్ 400 బైక్‌పై అత్యధికంగా రూ.6000 డిస్కౌంట్ లభిస్తోంది. ఐదేళ్ల వారంటీ, రెండు ఫ్రీ సర్వీసులు కలిపితే మరో రూ.1200 లబ్ది చేకూరనున్నది. బజాజ్ సిటీ 100పై రూ.1500 క్యాష్ బ్యాక్, ఫ్రీ సర్వీసులతో కలిపి రూ.2700 లబ్ధి చేకూరుతుంది.
బజాజ్ సీటీ 110 బైక్ మీద రూ.3200, బజాజ్ ప్లాటినా 100పై రూ.3200, బజాజ్ ప్లాటినా ఎల్లెల్వో బైక్ కొనుగోలుదారులకు రూ.3500, బజాజ్ డిస్కవర్ ఎల్ఎల్ఓ డ్రమ్ బైక్ మీద రూ.3200, బజాజ్ డిస్క్ 125 డిస్క్ బైక్ మీద రూ.3200, బజాజ్ పల్సర్ 125 మోటారు సైకిలుపై రూ.3700, బజాజ్ పల్సర్ 150పై రూ.4,200, పల్సర్ 180ఎఫ్ పై రూ.4200, పల్సర్ ఆర్ఎస్200, ఎన్ఎస్200, 220ఎఫ్ బైక్‌లపై రూ.5000, బజాజ్ అవేంజర్ 160 అండ్ 220 మోడళ్లపై రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది.
అంతేకాక అదనంగా రెండు సర్వీసింగ్‌లు, మూడేళ్ల వారంటీ కూడా కంపెనీయే నేరుగా అందించడంతో అన్ని బజాజ్ ఏజన్సీలలోనూ వీటిని అందుబాటులో ఉంచారు.
ఇప్పటికే గత నాలుగు నెలలుగా వాహన విక్రయాల్లో మందగమనం ఉండటంతో షోరూంల నిర్వాహకులు దసరాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆఫర్లు దీపావళి వరకు కొనసాగించనున్నట్లు పలువురు తెలిపారు.
యమహా ఎఫ్ జడ్ బైక్స్, స్కూటర్లపై డిఫరెంట్ ఆఫర్లు అందిస్తోంది. రూ.3999 డౌన్ పేమెంట్ చెల్లిస్తే బైక్ తీసుకోవచ్చు. అక్టోబర్ 31 వరకు అమలులో ఉండే ఈ ఆఫర్లతో రూ.8000 వరకు ఆదా చేయొచ్చునని తెలిపింది యమహా. పశ్చిమ రాష్ట్రాల్లో గోల్డ్ కాయిన్ ప్లస్ రూ.4000 వరకు రాయితీలు అందిస్తోంది. ఉత్తర భారతంలో ఇంకా ఆఫర్లు ప్రకటించలేదు.
సుజుకి మోటార్స్ మాత్రం లో డౌన్ పేమెంట్స్ ఆప్షన్లు, లక్కీ డ్రా ఆప్షన్లలో ఆఫర్లకు ప్రాదాన్యం ఇస్తోంది. పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపే వారికి రూ.8,500 క్యాష్ బ్యాక్ అందిస్తోంది.
రూ.777 చెల్లించి లోన్ ద్వారా బైక్ లేదా స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. లక్కీ డ్రాలో ఐదు గ్రాముల బంగారం గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. హీరో, హోండా, టీవీఎస్ మోటార్ సైకిళ్ల కంపెనీలు ఇంకా ఆఫర్లు ప్రకటించాల్సి ఉంది.