Kidambi Srikanth: శ్రీకాంత్ కు తెలంగాణ ప్రభుత్వం అభినందన.. త్వరలోనే భారీ నజరానా..?
Kidambi Srikanth: గచ్చిబౌలి లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ను తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.
రెండ్రోజుల క్రితం స్పెయిన్లో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రెండో స్థానం సంపాదించి దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చిన కిదాంబి శ్రీకాంత్ ను తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున.. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి శ్రీకాంత్ ను సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి షాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఖ్యాతిని తెచ్చిన శ్రీకాంత్ కు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ నజరానా ప్రకటిస్తారని ఆయన తెలిపారు.
కాగా.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ (బీడబ్ల్యూఎఫ్) 2021లో భాగంగా స్పెయిన్ వేదికగా ఆదివారం ముగిసిన పోటీలలో 15 వ సీడ్ కిదాంబి శ్రీకాంత్.. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సింగపూర్ కు చెందిన ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు లో కిన్ యె తో జరిగిన తుది పోరులో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
42 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన పోరులో లో కిన్ యె.. 21-15, 22-20 తో శ్రీకాంత్ ను ఓడించాడు. ఫలితంగా దేశానికి తొలి ప్రపంచ ఛాంపియన్షిప్ ను గెలవాలన్న శ్రీకాంత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఫైనల్లో హోరాహోరిగా పోరాడిన శ్రీకాంత్.. రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు.
ఇదిలాఉండగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గల పులెల్ల గోపిచంద్ అకాడమీలో శ్రీకాంత్ ను సన్మానం జరుగగా.. ఈ కార్యక్రమంలో పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ కోచ్ లు, అకాడమీ లోని ఆటగాళ్లు తదితరులు పాల్గొన్నారు.