దిశ అనే వెటర్నరీ డాక్టర్ ని నలుగురు అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం బతికుండగానే సజీవదహనం చేశారు. అయితే... ఆ నిందితులు నలుగురు పోలీసుల ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేశారు.

అయితే.... కొందరు మాత్రం చట్టాన్ని పోలీసులు చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని ఓ నెటిజన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వద్ద కూడా ప్రస్తావించారు. దీంతో... వారి అభిప్రాయాలకు సైనా ధీటైన సమాధానం చెప్పింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు అన్న విషయం తెలియగానే... ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘గ్రేట్ వర్క్.. హైదరాబాద్ పోలీస్.. మీకిదే నా శాల్యూట్’ అని సైనా పేర్కొంది. అయితే ఈ ట్వీట్‌ కి చాలా మంది మద్దతు పలకగా..ఓ నెటిజన్ మాత్రం విమర్శించాడు.

 ‘‘నీ నుంచి ఇంత తెలివితక్కువ ట్వీట్ రావడం చూసి ఆశ్చర్యపోయాను.  ఈ ట్వీట్‌పై నీకు ప్రశంసలు వస్తాయి. కానీ, నీ లాంటి ప్రముఖ వ్యక్తి, మహిళలకు ఆదర్శవంతమైన వ్యక్తి ఇలాంటి ట్వీట్లు చేసే ముందు దాని వల్ల కలిగే నష్టం గురించి ఒకసారి ఆలోచించు. ఇంకోసారి ఇలాంటి కామెంట్ చేసే ముందు కాస్త ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోమని కోరుతున్నా’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా... ఆ నెటిజన్ ట్వీట్ కి సైనా కూడా అదే రేంజ్ లో స్పందించింది. ‘ ఆ సమయంలో దిశ ఎంత నరకం అనుభవించి ఉంటుదో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. పోలీసులు రేపిస్టులను కూడా అదే రీతిలో కాల్చి చంపారు. అలా చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. నాకు ప్రశంసలు అవసరం లేదు. మీ అభిప్రాయాలతో రేపిస్టుల మనస్థత్వం కానీ.. చట్టాలు కానీ మారవు. ఆ సమయంలో బాధితురాలి చేతిలో తుపాకీ ఉంటే.. ఆమే వాళ్లని కాల్చి చంపేది’’ అని సైనా పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.