ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాపింయన్ షిప్ కాంస్య పతక విజేత, అర్జున్ అవార్డ్ గ్రహీత, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు భమడపాటి సాయి ప్రణీత్ వివాహం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సాయి ప్రణీత్‌కు, కాకినాడకు చెందిన జయంతి శ్రీనివాస్‌ కుమార్తె లక్ష్మీశ్వేతకు కాకినాడలోని విద్యుత్‌ నగర్‌లోని వెంకన్నబాబు కళ్యాణ మండపంలో పెళ్లి జరిగింది.

ఈ వేడుకకు నగర ప్రముఖులు, జాతీయ క్రీడాకారులు, పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశ్వీర్వదించారు. పెళ్లికి పంబంధించిన ఫోటోలను జాతీయ క్రీడాకారుడు సాత్విక్‌ సాయిరాజు అభిమానులతో పంచుకున్నాడు. డిసెంబరు 9న అంటే ఇవాళ హైదరాబాద్‌లో ఈ నూతన వధూవరులు ప్రత్యేక వింధు ఏర్పాటు చేయనున్నారు. 

2020 టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించే క్రమంలో సాయి ప్రణీత్ బీడబ్లుఎఫ్ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి చేరుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఏడాదే అర్జున అవార్డు అందుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. 1983లో ప్రకాశ్ పదుకొణె తర్వాత వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ నెగ్గిన భారత రెండో పురుష షట్లర్‌గా ప్రణీత్ నిలిచాడు.