Asianet News TeluguAsianet News Telugu

PV Sindhu: సింధూకు ఎట్టకేలకు ఓ టైటిల్.. సయ్యద్ మోదీ ఓపెన్ గెలిచిన తెలుగు తేజం.. రెండేండ్ల తర్వాత ఇదే..

Syed Modi International 2022: గతేడాది ఒలింపిక్స్ లో కాంస్యం మినహా మేజర్ టోర్నీలలో ఫైనల్ గండాన్ని దాటలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. ఈ ఏడాదిని మాత్రం టైటిల్ తో ప్రారంభించింది. 
 

PV Sindhu  Won Syed Modi International 2022 Tourney Against Malvika bansod In Finals
Author
Hyderabad, First Published Jan 23, 2022, 4:53 PM IST

భారతీయ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు ఎట్టకేలకు ఓ పెద్ద టోర్నీలో టైటిల్ నెగ్గింది. గతేడాది టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం మినహా  చెప్పుకోదగ్గ టోర్నీలలో  క్వార్టర్స్, సెమీస్ లలోనే  ఓడిన సింధూ..  ఈ ఏడాదిని మాత్రం ఘనంగా ఆరంభించింది.  లక్నో వేదికగా జరిగిన సయ్యద్ మోదీ సూపర్-300 టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఆదివారం  జరిగిన మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు.. మరో భారత క్రీడాకారిణి  మాల్విక భన్సోద్ పై అలవోకగా గెలిచింది.  గతేడాది దాటలేకపోయిన సెమీస్ గండాన్ని ఈ ఏడాది ప్రారంభంలోనే అధిగమించిన సింధూకు.. రాబోయే టోర్నీలకు ఈ   విజయం ఉత్సాహాన్నిచ్చింది.  2021 లో ఆమె డెన్మార్క్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ తో పాటు పలు టోర్నీలలో సెమీస్ వరకు వచ్చి అక్కడ విఫలమయ్యింది.

లక్నోలోని బాబు బనారసరి దాస్ ఇండోర్ స్టేడియంలో  ఆదివారం జరిగిన తుది పోరులో సింధు.. 21-13, 21-16 తేడాతో మల్వికను ఓడించింది. రెండు సార్లు  ఒలింపిక్ పతాక విజేత అయిన సింధు ముందు భన్సోద్ నిలవలేకపోయింది. ప్రపంచ ఏడో సీడ్ అయిన  సింధు.. 84వ ర్యాంకు కలిగిఉన్న మల్వికతో పోరును కేవలం 34 నిమిషాల్లోనే ముగించింది. కాగా.. సింధూకు  ఇది (సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్) రెండో టైటిల్. గతంలో 2019లో ఆమె విజేతగా నిలిచింది. 

 

ఆటగాడికి కోవిడ్.. మ్యాచ్ రద్దు : 

ఇదిలాఉండగా.. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ఆదివారం జరగాల్సి ఉన్న ఫైనల్ మ్యాచ్ రద్దైంది. ఆర్నాడ్ మోర్కెల్-లుకాస్ క్లార్బౌట్ మధ్య ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ వీరిలో ఒక ఆటగాడు కరోనా బారిన (పేరు వెల్లడించలేదు) పడ్డాడు. దీంతో  నిర్వాహకులు ఫైనల్ ను రద్దు చేశారు. 

 

 
ఇక మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఇషాన్ భట్నాగర్ -తనీషా క్రాస్టో ల జోడీ టైటిల్ నెగ్గింది.  ఫైనల్లో ఈ జోడి .. 21-16, 21-12 తేడాతో హేమ నాగేంద్ర బాబు -శ్రీవేద్య గురజాడ లను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. 29 నిమిషాల్లోనే  ఈ మ్యాచ్ ముగియడం గమనార్హం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios