బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ సుధీర్ఘకాలంగా సాగిస్తున్న తన ఆటకు వీడ్కోలు పలికారు. ఫిట్‌నెస్ ఇబ్బందుల వల్లే నిష్క్రమిస్తున్నాని ఆయన ప్రకటించాడు. కెరీర్‌లో సుధీర్ఘకాలంగా ఆటకు అంకితమయ్యాయని.. ఇకపై కొనసాగలేనని వెల్లడించాడు.

తన కష్టసుఖాల్లో కుటుంబం, కోచ్‌లు, సహచరులు, అభిమానులు నిరంతరం తనతోనే ఉన్నారని.. ఇప్పుడు 37 ఏళ్లు వచ్చేశాయన్నారు. ఫిట్‌నెస్ లోపాలు నొప్పి ఇబ్బందిగా మారాయని.. తన సహచరులతో కలిసి ఆడేందుకు అవి అనుమతించడం లేదని డాన్ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నారు.

ఆయన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. లీ ఛాంగ్ వీ సైతం ఓ ట్వీట్ చేశారు. ఈ రోజు వస్తుందని మనకు తెలుసునని.. మన జీవితాలకు ఇది భారమైన సందర్భమన్నాడు.

నువ్వు అద్భుతంగా ఆటకు వీడ్కోలు పలికావు. మనం గర్వంగా తలపడ్డ పోటీల్లో నువ్వు రారాజువు అని లీ ఛాంగ్ ప్రశంసించాడు. వీరిద్దరూ సుమారు 40 మ్యాచ్‌లలో తలపడగా 28 సార్లు డాన్ గెలిచాడు.

వీరిద్దరూ 22 ఫైనళ్లు, 15 సెమీఫైనళ్లలో తలపడగా.. ఇందులో రెండు ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనళ్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో లిన్‌డాన్ తనదైన ముద్రవేశాడు.

ప్రత్యర్ధులకు సింహస్వప్నంగా నిలిచాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచాడు. బ్యాడ్మింటన్‌లో కీలకమైన 9 టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకాలు సాధించాడు.