Japan Open: శ్రీకాంత్ ముందుకు.. లక్ష్యసేన్, సైనా ఇంటికి.. జపాన్ ఓపెన్‌లో భారత్‌కు షాక్
Japan Open 2022: జపాన్ ఓపెన్-2022లో బుధవారం భారత షట్లర్లకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఇండియా షట్లర్లైన లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ తొలి రౌండ్ లోనే ఇంటిబాట పట్టారు.
టోక్యో వేదికగా జరుగుతున్న జపాన్ ఓపెన్ - 2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్లు లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ లు తొలి రౌండ్ లోనే వెనుదిరిగారు. పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ ఒక్కడే తొలి రౌండ్ నెగ్గి ప్రీక్వార్టర్స్ కు అర్హత సాధించాడు. మెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ లో కూడా భారత్ కు నిరాశజనకమైన ఫలితాలే వచ్చాయి.
బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో కిదాంబి శ్రీకాంత్.. మలేషియాకు చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో ఓడించాడు. ఇటీవలే ముగిసిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్-2022లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్న శ్రీకాంత్.. జపాన్ ఓపెన్ తొలిరౌండ్ లో మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడాడు. లీ జి జియా తో పోరాడి గెలిచాడు.
ఇక మరో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. జపాన్ కు చెందిన కెంట నిషిమొటొ చేతిలో 21-18, 14-21, 13-21 తేడాతో ఓడిపోయి మొదటి రౌండ్ లోనే ఇంటిబాట పట్టాడు.
మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ పేలవ ఫామ్ ను కొనసాగించింది. తొలిరౌండ్ లో ఆమె.. జపాన్ క్రీడాకారిణి అకానె యమాగూచి చేతొలో 21-9, 21-17 తేడాతో ఓడింది. రెండు సెట్లలోనూ తేలిపోయిన సైనా.. తొలిరౌండ్ లోనే ఇంటిబాట పట్టింది.
పురుషుల డబుల్స్ లో అర్జున్-కపిల ల ద్వయం చోయ్-కిమ్ ల చేతిలో 21-19, 21-23, 15-21 తేడాతో ఓడింది. మహిళల డబుల్స్ లో జాలీ-గాయత్రి గోపీచంద్ ల జోడీ కిటితరకుల్-ప్రజోంగజ్ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ లో ప్రసాద్ - దేవాంగన్ ల ద్వయం.. జెంగ్-హుయాంగ్ చేతిలో ఓడింది.
ఇదే టోర్నీలో మంగళవారం పురుషుల సింగిల్స్ లో హెచ్ఎస్ ప్రణయ్.. ప్రిక్వార్టర్స్ కు అర్హత సాధించగా ఉమెన్స్ డబుల్స్ లో మాత్రం అశ్విని భట్ - శిఖా గౌతమ్ ల జోడీ.. దక్షిణకొరియా అమ్మాయిల చేతిలో ఓడిన విషయం తెలిసిందే.