హైదరాబాద్: తాము డేటింగ్ లో ఉన్నామని తమిళ నటుడు విష్ణు విశాల్ తో తన సంబంధం గురించి బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా చెప్పారు. ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ విషయం చెప్పారు. 

తమిళ నటుడు విష్ణు విశాల్ తో మీ బంధం గురించి అని అడిగిన ప్రశ్నకు తాము డేటింగ్ లో ఉన్నామని ఆమె చెప్పారు. ఎప్పుడు వివాహం చేసుకోవాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ఒక్కటవుతామని ఆమె చెప్పారు. అప్పుడు అందరినీ ఆహ్వానిస్తామని చెప్పారు. 

జాతీయ పార్టీల నుంచి పిలువు వచ్చి గానీ సున్నితంగా తిరస్కరించినట్లు జ్వాలా గుత్తా చెప్పారు. తన భావజాలానికి ఇప్పుడున్న పార్టీలతో కుదరదని ఆమె అన్నారు. తన వ్యవహార శైలి ఎవరికీ నచ్చదని, ఇప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఇష్టం లేదని ఆమె అన్నారు. 

కేరీర్ లో తనను బాధపెట్టిన సంఘటనలపై కూడా ఆమె మాట్లాడారు. బ్యాడ్మింటన్ కే జీవితాన్ని అంకితం చేశానని, అలాంటి తనను వరల్డ్ నెంబర్ 6గా ఉన్న సమయంలో పక్కన పెట్టారని, అది తనను చాలా కలచివేసిందని ఆమె చెప్పారు. దాని గురించి సంబంధిత వ్యక్తిని ప్రశ్నించడంతో తనను టార్గెట్ చేశారని ఆమె చెప్పారు. 

భారత డబుల్స్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా ఉన్న తనను గౌరవించాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి ఉంటుందని, కానీ అతను అలా చేయలేదని, తాను అతనికి చెందిన అకాడమీకి చెందిన ప్లేయర్ కాకపోవడమే కారణమని ఆమె అన్నారు. కోచ్ పుల్లెల గోపీచంద్ ను ఉద్దేశించి ఈ మాటలు అన్నట్లు అర్థమవుతోంది.