Thomas Cup 2022: టీమిండియాకు అభినందనల వెల్లువ.. కోటి రూపాయల నజరానా ప్రకటించిన కేంద్రమంత్రి
India Won Thomas Cup 2022: థామస్ కప్ లో ఇండోనేషియాను మట్టికరిపించి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెటర్లు బ్యాడ్మింటన్ ఆటగాళ్లను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
భారత పురుషుల బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణధ్యాయాన్ని లిఖిస్తూ.. 73 ఏండ్ల ప్రతిష్టాత్మక థామస్ కప్ లో సరికొత్త చరితను సృష్టించిన టీమిండియా పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఈ విజయం అపూర్వమని, భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని టీమిండియా క్రికెటర్లు కొనియాడుతున్నారు. 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియా ను టీమిండియా.. 3-0తో మట్టికరిపించి థామస్ కప్-2022 స్వర్ణాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
థామస్ కప్ లో చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. కోటి రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘థామస్ కప్ గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇదో అద్భుతమైన సందర్భం..’ అని రాసుకొచ్చాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ స్పందిస్తూ.. ‘భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు శుభాకాంక్షలు. ఇది అద్భుత విజయం. ఈ చరిత్రాత్మక విజయం యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుంది..’ అని పేర్కొన్నాడు.
టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘భారత క్రీడా చరిత్రలో ఇదొక నూతనధ్యాయం. థామస్ కప్ గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు. చాలా భాగా ఆడారు..’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న దినేశ్ కార్తీక్ కూడా.. భారత జట్టుకు అభినందనలు తెలిపాడు.
టీమిండియా మాజీ బ్యాటర్, ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ ట్విటర్ లో స్పందిస్తూ.. ‘మనం గతంలో వ్యక్తిగతంగా విజయాలు సాధించాం గానీ జట్టుగా స్వర్ణం నెగ్గడం ఇదే తొలిసారి. భారత జట్టు తరఫున ఆడిన ప్రతి ఒక్క ఆటగాడికి నా కృతజ్ఞతలు. ఈ కలను నిజం చేసినందుకు మేమంతా మీకు రుణపడి ఉంటాం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం..’ అని పేర్కొన్నాడు.
వీళ్లే గాక హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, రాహుల్ శర్మ, ఆర్పీ సింగ్, ఇర్పాన్ పఠాన్, వసీం జాఫర్, కృనాల్ పాండ్యా, గౌతం గంభీర్ లు కూడా భారత బ్యాడ్మింటన్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.