Singapore Open 2022: సైనా, ప్రణయ్ లకు షాక్.. క్వార్టర్స్ లోనే ఇంటిదారి
Saina Nehwal: సింగపూర్ ఓపెన్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు అందాయి. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ ఎస్ ప్రణయ్ ల పోరాటం క్వార్టర్స్ లోనే ముగిసింది.
సింగపూర్ లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 క్వార్టర్స్‌లో శుక్రవారం భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. భారత స్టార్ షట్లర్ లలో పీవీ సింధు.. క్వార్టర్స్ గండాన్ని దాటి సెమీస్ చేరగా సైనా నెహ్వాల్, హెచ్ ఎస్ ప్రణయ్ లు మాత్రం ఓడారు. క్వార్టర్స్ లో సైనా.. 13-21, 21-15, 20-22 తేడాతో జపాన్ కు చెందిన అయ ఒహోరి చేతిలో ఓడింది. తొలి సెట్ లో ఓడినా రెండో సెట్ లో పుంజుకున్న సైనా.. తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. రెండో సెట్ లో ఆమె కొనసాగించిన జోరుతో వ్యూహం మార్చి ఆడిన ఒహోరి మూడో సెట్ లో సైనాకు చెక్ పెట్టింది. దీంతో సైనాకు ఓటమి తప్పలేదు.
15 నెలల విరామం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టిన సైనా.. రెండో రౌండ్ లో ఆమె.. చైనా ప్లేయర్ హి బింగ్ జియావోతో జరిగిన మ్యాచ్‌లో 21-19, 11-21, 21-17 తేడాతో విజయం అందుకున్నది. కానీ ఆమె పోరాటం క్వార్టర్స్ లోనే ముగిసింది.
ఇక పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ కు కూడా షాక్ తప్పలేదు. అతడు జపాన్ షట్లర్ కొడాయి నరోకా చేతిలో ఓడాడు. ప్రణయ్.. 21-12, 14-21, 18-21 తేడాతో నరోకా చేతిలో ఓటమిపాలయ్యాడు. 63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ప్రణయ్ మళ్లీ గతంలో చేసిన తప్పిదాలే చేసి ఓటమి కొనితెచ్చుకున్నాడు.
సెమీస్ కు సింధు :
డబుల్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ లో సెమీస్ కు దూసుకెళ్లింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ అయిన ఆమె.. క్వార్టర్స్ లో చైనాకు చెందిన బలమైన ప్రత్యర్థి హాన్ యూ ను ఓడించి సెమీస్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం గంటపాటు సాగిన పోరులో సింధు.. 17-21, 21-11, 21-19 తో హ్యాన్ యూ ను మట్టికరిపించింది. సెమీస్ లో సైనా.. 38 వ ర్యాంకర్ అయిన జపాన్ క్రీడాకారిణి సయీనా కవాక్స్మి ని ఢీకొంటుంది. కవాక్స్మి క్వార్టర్స్ లో 21-17, 21-19 తేడాతో థాయ్లాండ్ కు చెందిన ఆరో సీడ్ క్రీడాకారిణి చూచ్వోంగ్ ను ఓడించింది.