జపాన్ ఓపెన్‌లో ప్రి క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన ప్రణయ్.. ఉమెన్స్ డబుల్స్‌లో షాక్
Japan Open 2022: టోక్యో వేదికగా జరుగుతున్న జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత్ కు మంగళవారం మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్ కు అర్హత సాధించాడు.
ఇటీవలే ముగిసిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్‌లో ఆశించిన మేర రాణించలేకపోయిన భారత షట్లర్లు.. జపాన్ ఓపెన్ లో కూడా అదే ఆటతీరును కనబరుస్తున్నారు. పురుషుల సింగిల్స్ లో హెచ్ఎస్ ప్రణయ్.. ప్రిక్వార్టర్స్ కు అర్హత సాధించగా ఉమెన్స్ డబుల్స్ లో మాత్రం అశ్విని భట్ - శిఖా గౌతమ్ ల జోడీ.. దక్షిణకొరియా అమ్మాయిల చేతిలో ఓడింది. అన్‌సీడెడ్ గా బరిలోకి దిగిన ప్రణయ్.. తొలి రౌండ్ లో ప్రపంచ 12వ ర్యాంకర్, హాంకాంగ్‌కు చెందిన అంగుస్ పై 11-10 తేడాతో విజయం సాధించాడు. ప్రణయ్ తొలి సెట్ ను ఒక పాయింట్ తేడాతో నెగ్గాడు. అయితే ఆ తర్వాత అంగుస్ గాయం కారణంగా రెండో సెట్ ఆడలేదు. దీంతో నిర్వాహకులు ప్రణయ్ ను విజేతగా ప్రకటించారు.
తాజా విజయంతో ప్రణయ్.. గతేడాది వరల్డ్ ఛాంపియన్ లో కియాన్ యూ (సింగపూర్) తో తలపడనున్నాడు. బీడబ్ల్యూఎప్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో మంచి ఫామ్ కనబరిచిన ప్రణయ్.. దానినే ఇక్కడా కొనసాగిస్తే కియాన్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇక ఇదే టోర్నీలో భాగంగా జరిగిన ఉమెన్స్ డబుల్స్ తొలి రౌండ్ లో భారత ద్వయం అశ్విని భట్ - శిఖా గౌతమ్ లు సౌత్ కొరియాకు చెందిన బేక్ హా న - లీ యు లిమ్ ల చేతిలో 15-21, 9-21 తేడాతో దారుణ పరాజయం పాలయ్యారు.
ఇక ఈ ఈవెంట్ లో భారత స్టార్ ప్లేయర్లు పివి సింధు, సైనా నెహ్వాల్, లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్ త్వరలోనే తమ ప్రత్యర్థులతో తలపడబోతున్నారు. మొత్తంగా 15 మంది భారత షట్లర్లు బరిలో ఉన్నారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఈ టోర్నీ జరుగనుంది.