భారత షట్లర్ సైనా నెహ్వాల్ కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరస ఓటమిలతో సతమతమౌతున్న సైనాకి హాంకాంగ్ ఓపెన్ లోనూ నిరాశే ఎదురైంది. గతవారం జరిగిన చైనా ఓపెన్ లో తొలి రౌండ్ లోనే సైనా ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. కాగా... తాజాగా జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నూలోనూ ఆమెకు నిరాశే ఎదురైంది.

AlsoRead నా చివరి శ్వాస వరకు నీతోనే...సానియా మీర్జా ఎమోషనల్ పోస్ట్...

బుధవారం జరిగిన తొలి రౌండ్ లో 9వ సీడ్ సైనా 13-21, 20-22 తో చైనా క్రీడాకారిణి కాయ్ యాన్ యాన్ చేతిలో ఓటమిపాలైంది. కేవలం 30 నిమిషాల్లోనే సైనా ప్రత్యర్థి ముందు తలవంచింది. తొలిగేమ్ లో కాయ్ యాన్ యాన్ దూకుడుగా ఆడగా... ఆమెను తట్టుకోవడం సైనా వల్ల కాలేదు. ఆ తర్వాత రెండో గేమ్ లో సైనా యాన్  యాన్ కి గట్టి పోటీ ఇచ్చింది. అయినా విజయం మాత్రం వరించలేదు.

కాగా... గతవారం జరిగిన చైనా ఓపెన్ లోనూ సైనా ఇదే క్రీడాకారిణి చేతిలో ఓటమిపాలవ్వడం గమనార్హం.  ఈ సీజన్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన సైనా తర్వాత  వరస పరాజయాలతో సతమతమౌతోంది. తొలి రౌండ్ లోనూ ఇంటికి తిరుగుపయనం చేయడం ఈ సీజన్ లో సైనాకి 8వ సారి కావడం గమనార్హం.