BWF 2022: సెమీస్‌లో ఓడిన సాత్విక్-చిరాగ్ జోడీ.. కాంస్యంతో సరి.. అయినా చరిత్రే..
Badminton World Championships: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీకి సెమీస్ లో షాక్ తగిలింది. దీంతో ఈ జోడీ కాంస్యంతో సరిపెట్టుకుంది.
జపాన్ వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ (బీడబ్ల్యూఎఫ్) లో భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి ల జోడీ సెమీస్ లో ఓడింది. టోర్నీ ఆసాంతం అద్బుతంగా రాణించిన ఈ జోడీ.. కీలక పురుషుల సెమీస్ డబుల్స్‌లో మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సో వుయ్‌ల చేతిలో 20-22, 21-18, 21-16 తేడాతో ఓడింది. మలేషియా డబుల్స్ జోడీ ఆరోన్ చియా-సో వుయ్ ల చేతిలో సాత్విక్-చిరాగ్ ఓడటం ఇది వరుసగా ఆరోసారి కావడం గమనార్హం. 77 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో ఓటమి పాలైనా ఈ ఫలితంతో భారత జోడీ కాంస్యంతో సరిపెట్టుకుంది.
సెమీస్ వరకు అద్భుతంగా రాణించిన సాత్విక్-చిరాగ్ లు ఈ మ్యాచ్ లో తొలి సెట్ లో భాగానే ఆడారు. తొలి సెట్ ను 22-20 తో నెగ్గిన ఈ జోడీ.. తర్వాత పట్టు కోల్పోయింది. రెండో సెట్ లో పుంజుకున్న మలేషియా జోడీ.. మూడో సెట్ ను కూడా తమ ఖాతాలో వేసుకుని ఫైనల్ కు చేరింది.
సెమీఫైనల్లో ఓడటంతో సాత్విక్-చిరాగ్ లు కాంస్యంతో సరిపెట్టుకున్నారు. అయితే ఓడినా ఈ జోడీ చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్ లో పురుషుల డబుల్స్ లో కాంస్యం నెగ్గిన తొలి జంటగా చరిత్రకెక్కారు. ఈ ఈవెంట్ లో భారత్ ఇప్పటివరకు పురుషుల డబుల్స్ లో పతకం నెగ్గలేదు. 2011లో మహిళల డబుల్స్ లో జ్వాల గుత్తా-అశ్విని పొన్నప్పలు కాంస్యం నెగ్గిన తర్వాత 11 ఏండ్లకు మళ్లీ భారత్ కు ఈ విభాగంలో పతకం రావడం విశేషం. ఇక సాత్విక్-చిరాగ్ ల కాంస్యం.. ఈ ఈవెంట్ లో భారత్ కు మొత్తంగా 13వ పతకం కావడం గమనార్హం.
రేపటితో ముగియనున్న ఈ పోటీలలో భారత్ పలువురు స్టార్ షట్లర్ల మీద భారీగా ఆశలు పెట్టుకుంది. సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ వంటి కీలక ఆటగాళ్లు ఆదిలోనే వెనుదిరిగారు.