చిన్నారి బాలికలను అవమానించడం మానేయండి.. హిజాబ్‌పై గుత్తా జ్వాల ట్వీట్..
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం (Hijab Row) కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఈ విషయం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. తాజాగా హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల (Gutta jwala) స్పందించారు.
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం (Hijab Row) కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఈ విషయం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. దీనిపై పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల (Gutta jwala) స్పందించారు. చిన్నారి బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయాలని కోరుతూ ఆమె ట్వీట్ చేశారు. నీచ రాజకీయాల నుండి వారిని తప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి అని విజ్ఞప్తి చేశారు.
‘చిన్నారి బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయండి. అక్కడికి వారు తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. పాఠశాల వారి సురక్షిత స్వర్గంగా భావించబడుతుంది. హెడ్ స్కార్ఫ్ ఉందా, లేదా అనే.. ఈ నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి' అంటూ గుత్తా జ్వాల భావోద్వేగంతో కూడిన ట్వీట్‌ను పోస్టు చేశారు.
ఇక, కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మొదలైన ఈ వివాదం ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాల వరకూ చేరిన సంగతి తెలిసిందే. పాఠశాలలు, కాలేజ్‌లు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇది రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అయితే ఈ వివాదంపై తుది తీర్పు వెలువడే వరకు పాఠశాలల్లో మతాన్ని వ్యక్తీకరించే దుస్తులు వేసుకురావద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకోగా.. యజమాన్యాలు కోర్టు ఆదేశాలను అమలు చేశారు. హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను స్టాఫ్ అడ్డుకుంది. స్కూల్ గేటు బయటే వారిని నిలిపేసింది. హిజాబ్ తొలగించిన వారినే పాఠశాలలకు అనుమతించిన ఘటనకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
మాండ్య జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల గేటు బయట కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చారు. వారిని స్కూల్‌లోనికి అనుమతించడానికి స్టాఫ్ ససేమిరా అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు హిజాబ్ తొలగించే పాఠశాలలకు రావాలని ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించారు. ఈ విషయమై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. వేడి వేడిగా వారి మధ్య వాగ్వాదాలు జరిగాయి. తమ పిల్లలను హిజాబ్ ధరించే స్కూల్‌లోకి అనుమతించాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. కనీసం తరగతి గది వరకైనా తమ పిల్లలను హిజాబ్ ధరించే వెళ్లడానికి అనుమతించాలని, క్లాసు రూమ్‌లో వారు తమ హిజాబ్ తొలగిస్తారని చెప్పారు. అయినప్పటికీ ఆ ఉపాధ్యాయులు వారిని అనుమతించలేదు. స్కూల్ బయటే హిజాబ్ తొలగించాలని స్పష్టం చేశారు.