BWF World Championships 2021: శ్రీకాంత్ కు భంగపాటు.. ఫైనల్లో కిన్ దే విజయం.. మహిళల విజేత యమగుచి
Kidambi Srikanth: ఎన్నో ఆశలతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో అడుగుపెట్టిన తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్.. తుది పోరులో పరాజయం పాలయ్యాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ఫిప్ లో తొలి సింగిల్స్ (పురుషుల) టైటిల్ గెలవాలన్న అతడి కల నెరవేరలేదు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ (బీడబ్ల్యూఎఫ్) 2021లో భాగంగా స్పెయిన్ వేదికగా జరుగుతున్న పోటీలలో భారత్ కు చెందిన 15 వ సీడ్ కిదాంబి శ్రీకాంత్.. ఆఖరు మెట్టుపై తడబడ్డాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సింగపూర్ కు చెందిన ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు లో కిన్ యె తో జరిగిన తుది పోరులో అతడు ఓటమి పాలయ్యాడు. 42 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన పోరులో లో కిన్ యె.. 21-15, 22-20 తో శ్రీకాంత్ ను ఓడించాడు. ఫలితంగా దేశానికి తొలి ప్రపంచ ఛాంపియన్షిప్ ను గెలవాలన్న శ్రీకాంత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఫైనల్లో హోరాహోరిగా పోరాడిన శ్రీకాంత్.. రెండో స్థానంతో సిల్వర్ మెడల్ గెలిచాడు. ఇది కియాన్ కెరీర్ లో తొలి టైటిల్.
తొలి సెట్ లో కిన్.. శ్రీకాంత్ పై ఆధిపత్యం చెలాయించాడు. ఆట ఆరంభం నుంచే శ్రీకాంత్ పై ధాటిగా ఆడిన కిన్.. అతడికి కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. కానీ రెండో గేమ్ లో శ్రీకాంత్ పుంజుకున్నాడు. కిన్ తో హోరాహోరిగా పోరాడాడు. ఓ దశలో గేమ్ మూడో సెట్ కు వెళ్తుందా..? అనిపించినా కిన్ మాత్రం అందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ ఇద్దరూ 2018లో ఒకసారి తలపడ్డారు. ఆ తర్వాత ఇదే మళ్లీ ఈ ఫైనల్ మ్యాచులోనే ముఖాముఖిగా ఆడారు. ఈ గెలుపుతో కిన్ చరిత్ర సృష్టించాడు. సింగపూర్ నుంచి బీడబ్ల్యూఎఫ్ లో నెగ్గిన తొలి ఆటగాడిగా అతడు రికార్డులకెక్కాడు.
ఇదిలాఉండగా.. పురుషుల డబుల్స్ లో టకురో హోకి-యుగొ కొబయషి (జపాన్) ల ద్వయం.. చైనాకు చెందిన హె జి టింగ్- టన్ కియాంగ్ లను ఓడించింది. ఫైనల్లో జపాన్ జంట... 21-12, 21-18 తేడాతో చైనాపై ఘన విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది.
తొలి భారతీయుడు...
ప్రపంచ ఛాంపియన్షిప్ లో భాగంగా తుది పోరులో ఓడినా శ్రీకాంత్ అరుదైన ఘనత సాధించాడు. బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ కు చేరడమే గాక రజత పతకం నెగ్గిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మొత్తంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చరిత్రలో సింగిల్స్ విభాగంలో ఫైనల్ కు చేరిన మూడో ఆటగాడు శ్రీకాంతే. గతంలో తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు మూడు సార్లు.. మరో హైదరాబాదీ సైనా నెహ్వాల్ ఓసారి ఫైనల్ కు చేరారు. కానీ పురుషుల సింగిల్స్ లో మాత్రం ఫైనల్ కు చేరింది శ్రీకాంత్ ఒక్కడే కావడం గమనార్హం.
మెన్స్ సింగిల్స్ లో భారత్ పతకాలు :
కిదాంబి శ్రీకాంత్ (సిల్వర్ మెడల్-2021), ప్రకాశ్ పదుకునే (కాంస్య పతకం-1983) బి. సాయి ప్రణీత్ (కాంస్యం-2019), లక్ష్య సేన్ (కాంస్యం-2021)
మహిళల సింగిల్స్ యమగుచి దే...
మరోవైపు మహిళల సింగిల్స్ లో జపాన్ క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్ 3 అకానే యమగుచి విజేతగా నిలిచింది. ఆదివారం ఫైనల్స్ లో భాగంగా ఇక్కడి కరోలినా మారిన్ స్టేడియంలో జరిగిన పోరులో ఆమె చైనీస్ తైఫీకి చెందిన క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్ వన్ తైజు యింగ్ తో జరిగిన పోరులో ఘన విజయం సాధించింది. ఆఖరి పోరులో ఆమె 21-14, 21-11 తో వరుస సెట్లలో తైజు యింగ్ పై గెలిచింది. 39 నిమిషాలలోనే ముగిసిన ఈ మ్యాచ్ లో జపాన్ క్రీడాకారిణి స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట తొలి నుంచే వెనుకబడ్డ తైజు యింగ్ ను ఆమె కోలుకోనివ్వలేదు. ఈ విజయంతో ఆమె ప్రపంచ ఛాంపియన్షిప్ నెగ్గిన రెండో జపాన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. టోర్నీ ఆసాంతం రాణించిన తైజు యింగ్.. రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
డబుల్స్ లో థాయ్ జోడీ హవా :
మరోవైపు మహిళల డబుల్స్ లో ప్రపంచ రెండో సీడ్, థాయ్లాండ్ కు చెందిన పువావరనుక్రో, సప్సిరీ టరెట్టనాచాయ్ లు మిక్స్డ్ డబుల్ టైటిల్ గెలిచారు. ఈ జోడీ ఫైనల్లో ప్రపంచ మూడో సీడ్ జపాన్ ద్వయం.. యుటా వటనాబే, అరిసా హిగాషినోపై 21-13, 21-14 తో గెలుపొందింది.