సారాంశం

BWF World Championships 2021: స్పెయిన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తెలుగమ్మాయి పీవీ సింధు.. ఈ ఏడాదిని ఓటమితో ముగించింది. 

భారత బ్యాడ్మింటన్ కు శుక్రవారం ఒక మోదం ఒక ఖేదంగా గడిచింది. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, వరల్డ్ నెంబర్ త్రీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు..  ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల నుంచి నిష్క్రమించగా.. మరోవైపు మరో తెలుగు ఆటగాడు కిదాంబి శ్రీకాంత్  ఫైనల్ కు చేరి పతకం పక్కా చేసుకున్నాడు. స్పెయిన్  లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా.. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ లో  పీవీ సింధు.. తైవాన్ కు చెందిన వరల్డ్ నెంబర్ వన్  ప్లేయర్.. తైజుయింగ్ చేతిలో ఓడింది.  దీంతో ఈ ఏడాదిని సింధు ఓటమితో ముగించింది. 

మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో భాగంగా..  తైజుయింగ్  21-17, 21-13 తేడాతో సింధును ఓడించింది. 42 నిమిషాల పాటు సాగిన పోరులో తైజుయింగ్.. మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తాజా ప్రదర్శనతో ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేగాక ఈ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో  ఆరో పతకాన్ని చేజార్చుకుంది. గతంలో సింధు.. బీడబ్ల్యూఎఫ్ టోర్నీలలో ఐదు సార్లు విజేతగా నిలిచింది. 

 

మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో కిదాంబి శ్రీకాంత్.. మాజీ  ప్రపంచ ఛాంపియన్ అయిన డచ్ ఆటగాడు మార్క్ కల్జౌను  ఓడించాడు. 26 నిమిషాల్లోనే ముగిసిన ఈ  గేమ్ లో శ్రీకాంత్.. 21-8, 21-7 తేడాతో కల్జౌను మట్టికరిపించి సెమీస్ కు చేరాడు. దీంతో అతడు పతకం పక్కా చేసుకున్నాడు. 

 

పన్నెండో సీడ్ గా బరిలోకి దిగిన  శ్రీకాంత్.. తొలిసెట్ లోనే  కల్జౌకు షాకిచ్చాడు.  ఆట ప్రారంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్.. కల్జౌకు కోలుకోవడానికి టైమ్ ఇవ్వలేదు. రెండో సెట్ లో కూడా అతడిపై ధాటిగా ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ సెమీస్ కు వెళ్లడం శ్రీకాంత్ కు ఇదే  ప్రథమం.