కెరీర్ ని మలుపు తిప్పిన విజయం అదే: పీవీ సింధు

కెరీర్‌లో ఎన్నో విజయాలు, ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన విజయం ఒకటుంది. ఆ విషయాన్ని సింధు స్వయంగా వెల్లడించింది. 

Beating Olympic champion Li Xuerui was the turning point of my career: Badminton Star PV Sindhu

కరోనా మహమ్మారి దెబ్బకు క్రీడాకారులంతా తమ ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో తమ అభిమానులతో అనేక విషయాలను పంచుకోవడానికి వాడుకుంటున్నారు. టాక్ షోస్ లో పాల్గొంటూ తమ జీవితంలోని ఎన్నో విషయాలను గురించి చెబుతున్నారు. తాజాగా బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సైతం ఒక టాక్ షో లో పాల్గొని ఎన్నో విషయాలను చెప్పింది ఈ వరల్డ్‌ చాంపియన్‌. 

ఒలింపిక్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ పి.వి సింధు రానున్న టోక్యో ఒలింపిక్స్‌ పసిడి రేసులో హాట్‌ షట్లర్‌. చిన్న చితకా షట్లర్లతో అలవోకగా ఓడిన సింధు.. మేటి క్రీడాకారిణులతో ఆడినప్పుడు ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శనే చేసింది. 

సింధు ఉత్తమ ప్రదర్శన చూడాలంటే, ఆమెకు ఎదురుగా ఉత్తమ ప్రత్యర్థిని బరిలోకి నిలపాల్సిందే. 2013 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం నెగ్గిన సింధు 2018 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించింది. కెరీర్‌లో ఎన్నో విజయాలు, ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన విజయం ఒకటుంది. ఆ విషయాన్ని సింధు స్వయంగా వెల్లడించింది. 

తన కెరీర్‌ను మలుపు తిప్పిన సంఘటన, 2012 ఒలింపిక్‌ చాంపియన్‌ లీ జురే పై విజయం అని సింధు తెలిపింది. ఆ సమయంలో లీ జురే ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అని, చైనా ఓపెన్‌ మాస్టర్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఆమెను ఓడించటం తన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అని తన మనసుకు అత్యంత నచ్చిన విజయం గురించి సింధు అభిమానులతో పంచుకుంది.  

ఇక తనకు రివ్ ఒలింపిక్స్ తరువాత ఎన్నో బహుమతులు వచ్చాయని, వాటన్నిటిలో కెల్లా ఒక బహుమతి తనకు బాగా నచ్చిందని చెప్పారు. "రియో ఒలింపిక్స్‌ విజయంతో ఎన్నో విలువైన బహమతులు అందుకున్నాను. కానీ నా హృదయానికి హత్తుకునే బహమానం ఓ అభిమాని నుంచి వచ్చింది. తన నెల జీతాన్ని కానుకగా పంపించాడు. అతడికి నేనో ఉత్తరం రాసి, కొంత డబ్బు సైతం పంపించాను" అని సింధు తన అభిమాని చూపిన అభిమానాన్ని ఇతర అభిమానులతో పంచుకుంది.  

కెరీర్‌ అసాంతం బ్యాడ్మింటన్‌తోనే దోస్తీ చేసానని, ఈ లాక్‌డౌన్‌లో కొత్త విషయాలను నేర్చుకుంటున్నానని సింధు తెలిపింది. కుకింగ్‌, బేకింగ్‌, పెయింటింగ్‌ వంటి కొత్త పనుల్లో ప్రవేశం పొందుతున్నానని టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ముదిత్‌ డాని టాక్‌ షోలో పివి సింధు తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios