కౌలాలంపూర్: రోడ్డు ప్రమాదం నుంచి ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ కెంటో మొమోటా బయటపడ్డారు. ఆయనకు పెను ప్రమాదం తప్పింది. జపాన్ కు చెందిన మొమోటా ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అయితే, ఆయన గాయాల నుంచి బయటపడ్డారు. 

వ్యాన్ డ్రైవర్ మాత్రం మరణించాడు. వ్యాన్ లో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారు జామున జరిగినంది. ఆదివారం మలేషియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మొమోటా అద్దె కారులో విమానాశ్రయానికి బయలుదేరాడు. 

ఆయన ప్రయాణిస్తున్న వాహనం తెల్లవారు జామున 4.40 గంటల ప్రాంతంలో ముందు వెళ్తున్న కంటెనర్ ను ఢీకొట్టింది. దాంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. కారు డ్రైవర్ బవన్ నాగేశ్వర రావు (24) అక్కడికక్కడే మరణించాడు. 

మొమోటా ముక్కు ఫ్రాక్చర్ అయింది. దాంతో పాటు ఆయన ముఖానికి గాయాలయ్యాయి. బ్రిటెన్ కు చెదిన విలియం థామస్ (30), జపాన్ కు చెందిన హరియామా యూ (35), మోరిమోటో అర్కిఫూమీ (42) ఈ ప్రమాదంలో గాయపడ్డారు. హిరియామా యూ కుడి కాలు విరగడంతో పాటు ముఖానికి గాయాలయ్యాయి.

గాయపడిన నలుగురి పరిస్థితి నిలకడగా ఉందని మలేషియా ఆరోగ్య శాఖ మంత్రి జుల్కేఫి అహ్మద్ చెప్పారు. 2019లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన 26 ఏళ్ల మొమోటా 11 టోర్నీలు గెలుచుకున్నాడు.