Asianet News TeluguAsianet News Telugu

బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరానికి కరోనా ఎఫెక్ట్.. రెండు పాజిటివ్ కేసులు

భారత స్పోర్ట్స్ అథారిటీ నిబంధనల ప్రకారం శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులు, కోచ్ లు సహాయక సిబ్బంది కలిపి మొత్తం 20 మందికి పరీక్షలు నిర్వహించగా.. వీరిద్దరికీ పాజిటివ్ గా తేలింది. 

Badminton Doubles Player N Sikki Reddy Tests Positive For Coronavirus
Author
Hyderabad, First Published Aug 14, 2020, 7:28 AM IST


కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలంల చేస్తోంది. మన దేశంలోనూ ఈ వైరస్ ఉధృతి విపరీతంగా పెరిగిపోతోంది. కాగా.. తాజాగా ఈ వైరస్ ఎఫెక్ట్ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరానికి కూడా ఎఫెక్ట్ అయ్యింది.  దాదాపు ఐదు నెలల విరామం తర్వాత ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నగరంలో జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం మొదలైంది.

అయితే.. అలా మొదలైందో లేదో..  ఇలా బ్రేకులు పడ్డాయి.  గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న మహిళల డబుల్స్ ష్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ కిరణ్ కి కరోనా సోకింది. 

భారత స్పోర్ట్స్ అథారిటీ నిబంధనల ప్రకారం శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులు, కోచ్ లు సహాయక సిబ్బంది కలిపి మొత్తం 20 మందికి పరీక్షలు నిర్వహించగా.. వీరిద్దరికీ పాజిటివ్ గా తేలింది. ఇందులో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, ఆమె తండ్రి పీవీ రమణ, చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌ సహా 18 మందికి నెగెటివ్‌ ఫలితం రాగా... సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్‌ కిరణ్‌లకు కరోనా పాజిటివ్‌ తేలిందని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే వీరిద్దరికీ ఎలాంటి లక్షణాలు లేవని ‘బాయ్‌’ వివరించింది. శానిటైజ్‌ చేసేందుకు అకాడమీని తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం కరోనా పరీక్షలకు హాజరైన వారందరూ  శుక్రవారం స్థానిక కార్పొరేట్‌ ఆసుపత్రిలో మరోసారి కోవిడ్‌ టెస్టులు చేయించుకుంటారని తెలిసింది. సిక్కి రెడ్డి, కిరణ్‌ ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారందరికీ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయనున్నారు. 

‘భారత స్పోర్ట్స్‌ అథారిటీ నిబంధనల ప్రకారం జాతీయ శిక్షణ శిబిరంతో సంబంధం ఉన్న క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయ సిబ్బందికి, కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. కోచింగ్‌ క్యాంప్‌ మళ్లీ సజావుగా సాగేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సాధ్యమైనంత త్వరలో మళ్లీ శిబిరం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం’ అని జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios