BWF: సింధూ లేకుండా మరో కీలక సమరానికి సిద్ధమవుతున్న భారత్.. బీడబ్ల్యూఎఫ్ షెడ్యూల్ ఇదే..
BWF World Championships: ఈనెల 21 నుంచి 28 వరకు జపాన్ వేదికగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో జరుగబోయే ప్రపంచ ఛాంపియన్షిప్‌కు (BWF World championship 2022) సిద్ధమవుతున్నారు.
రెండు నెలల క్రితం ఇండోనేషియా వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక థామస్ కప్ నెగ్గి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టు.. ఇటీవలే బర్మింగ్‌హోమ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో కూడా మెరుగ్గా రాణించింది. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా మూడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలతో మొత్తంగా ఆరు పతకాలు సాధించిన భారత షట్లర్లు.. ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 21 నుంచి 28 వరకు జపాన్ వేదికగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో జరుగబోయే ప్రపంచ ఛాంపియన్షిప్‌కు సిద్ధమవుతున్నారు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు లేకుండానే ఈ మెగా టోర్నీలో భారత్ బరిలోకి దిగనుంది.
గతంలో రెండేండ్లకోసారి జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు.. కొన్నాళ్లుగా ప్రతి ఏడాది (ఒలింపిక్స్ ఉంటే ఆ ఏడాది జరుగవు) జరుగుతున్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీ జపాన్ రాజధాని టోక్యోలో జరుగనుంది. ఈ మెగా ఈవెంట్ లో ఇప్పటివరకు భారత్ ఒకే ఒక్క స్వర్ణం (మొత్తంగా 12) నెగ్గింది. 2019లో సింధు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో తొలి స్వర్ణం గెలిచిన భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. కానీ ఈసారి ఆమె గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం భారత్ కు కోలుకోలేని షాక్.
ఇక 2022 ఎడిషన్ లో సింధు లేకపోయినా భారత కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ వంటివారితో పాటు వెటరన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా బరిలో ఉంది. 2015, 2017లో సైనా.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో రజతం, కాంస్యం గెలుచుకుంది.
BWF World Championships 2022 షెడ్యూల్ :
- ఆగస్టు 21న మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్ లో తొలి రౌండ్ మ్యాచ్ లు ఆగస్టు 22 , 23 న జరుగుతాయి. 24న రెండో రౌండ్, 25న క్వార్టర్స్, 26న సెమీస్ జరుగనుంది. ఫైనల్ ఆగస్టు 27న నిర్వహిస్తారు.
భారత క్రీడాకారులు :
- మహిళల సింగిల్స్ లో సింధు లేకపోయినా.. సైనా నెహ్వాల్ ఆ లోటును భర్తీ చేయనుంది. ఆమెతో పాటు మాల్విక బన్సోద్ కూడా బరిలో ఉంది.
- పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ లతో పాటు సాయి ప్రణీత్ కూడా ఉన్నాడు.
- మెన్స్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి
- ఉమెన్స్ డబుల్స్ లో ట్రీసాజాలీ -గాయత్రి గోపీచంద్ లతో పాటు మొత్తంగా 27 మంది భారతీయ షట్లర్లు బరిలోకి దిగనున్నారు.
గతేడాది భారత్ ప్రదర్శన:
2021లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భారత జట్టుకు పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ రజతం నెగ్గగా.. లక్ష్య సేన్ కాంస్యం గెలిచాడు.