న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్‌ ఇండియా తన ఎఫ్‌ జడ్‌ సిరీస్‌లో రెండు సరికొత్త బైక్‌లను సోమవారం మార్కెట్లో విడుదలచేసింది. ఎఫ్‌ జెడ్‌–ఎఫ్‌1, ఎఫ్‌జెడ్‌ఎస్‌–ఎఫ్‌1 పేర్లతో ఆవిష్కరించిన ఈ బైక్‌ల్లో అధునాతన బ్రేకింగ్‌ వ్యవస్థ, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌).. 149 సీసీ 4–స్ట్రోక్, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ తదితర వసతులు ఉన్నాయి.  ఈ బైక్‌ల ధరల శ్రేణి రూ.95,000–రూ.97,000గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్‌ మెటొఫుమీ షితార మాట్లాడుతూ ‘రెండు నూతన బైక్‌ల విడుదల ద్వారా డీలక్స్‌ క్లాస్‌లో సంస్థ మార్కెట్‌ వాటా మరింత పెరగనుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

ఎఫ్‌జడ్- ఎఫ్1 మోడల్ బైక్.. మెట్రిక్ బ్లాక్, రేసింగ్ బ్లూ కలర్స్‌లో, ఎఫ్‌జడ్ఎస్- ఎఫ్1 తరహా బైక్ మాట్ బ్లాక్, డార్క్ మాట్ బ్లాక్, గ్రే అండ్ క్యాన్ బ్లూ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. వైజడ్‌ఎఫ్-ఆర్15 వర్షన్ 3.0తోపాటు ఏబీఎస్‌తో కూడిన ఎఫ్‌జడ్- ఎఫ్1 బైక్‌నకు కొనసాగింపుగా ఈ రెండు బైక్‌లను యమహా మార్కెట్లోకి విడుదల చేసింది. 

వీటితోపాటు యమహా ఇండియా భారత్ మార్కెట్లోకి ఎఫ్ జడ్25, ఫేజర్-25 మోడల్ బైక్‌లను కూడా ఆవిష్కరించింది. ఈ రెండు బైకులు కూడా 249 సీసీ ఇంజిన్ సామర్థ్యం, డ్యూయల్ చానెల్ ఏబీఎస్ కలిగి ఉన్నాయి. ఎఫ్ జడ్ -25 మోడల్ బైక్ ధర రూ.1.33 లక్షలు కాగా, ఫేజర్-25 ధర రూ.1.43 లక్షలు పలుకుతోంది. ఎఫ్ జడ్ 25 మోడల్ బైక్ మాట్ బ్లాక్, క్యాన్ బ్లూ, డార్క్ మాట్ బ్లూ, ఫేజర్ -25 బైక్ డార్క్ మాట్, మెటాలిక్ బ్లాక్ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో వస్తాయి.