భారత్ మార్కెట్ పై దృష్టి: స్కోడా మార్పులకు శ్రీకారం
మనదేశంలో మళ్లీ కార్ల మార్కెట్‌లో పూర్తిస్థాయిలో పున: ప్రవేశం చేయాలని వోక్స్ వ్యాగన్ అభిలషిస్తోంది.
ముంబై: మనదేశంలో మళ్లీ కార్ల మార్కెట్‌లో పూర్తిస్థాయిలో పున: ప్రవేశం చేయాలని వోక్స్ వ్యాగన్ అభిలషిస్తోంది. ఆ దిశగా వోక్స్ వ్యాగన్ చెక్ యూనిట్ ‘స్కోడా’ ఈ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నది. సుమారు రూ.7,900 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అధికారికంగా ప్రకటించింది.
వోక్స్ వ్యాగన్ - స్కోడా గ్రూపు 2025 నాటికి భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఐదు శాతం వాటా పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెండు సంస్థలు ప్రస్తుతం భారత ప్రయాణికుల వాహనాల మార్కెట్‌లో రెండు శాతానికి లోపే విక్రయిస్తున్నాయి. ఏటా 32.7 లక్షల వాహనాలు అమ్ముడవుతున్నాయి.
స్కోడా ఆటో గ్లోబల్ సీఈఓ బెర్న్‌హార్డ్ మెయిర్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా భారత దేశం ఆటోమొబైల్ మార్కెట్‌లో మూడో స్థానాన్ని ఆక్రమించనున్నదని పేర్కొన్నారు. భారత దేశంతో తమ గ్రూప్ ఎదుగుదలకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని బెర్న్ హార్డ్ మెయిర్ పేర్కొన్నారు. భారతదేశంలో పురోగతి లక్ష్యాలను సాధించడం కోసం వోక్స్ వ్యాగన్ పోరాడుతున్నదని అంగీకరించారు. తమ గ్రూప్ దీనిపై పూర్తిస్థాయి అవగాహనతో ఉన్నామని తెలిపారు.
తాజాగా పెట్టనున్న పెట్టుబడులను నూతన ఉత్పాదక రంగంలో వినియోగిస్తామని స్కోడా గ్లోబల్ సీఈఓ బెర్న్ హార్డ్ మెయిర్ అన్నారు. ఎస్ యూవీ కారు ఉత్పత్తితో ప్రారంభిస్తామన్నారు. ఉత్పత్తుల అభివ్రుద్ధి కేంద్రం, ఎంక్యూబీ ఏ0 ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తామన్నారు. తమ గ్రూపు విస్తరణతో నాలుగు వేల మంది నుంచి 5,000 మంది ఇంజినీర్లకు నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
తొలుత గతేడాది డిసెంబర్‌లోనే భారతదేశంలో తమ మార్కెట్ విస్తరణకు రూ.7,900 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సిద్దమని స్కోడా - వోక్స్ వ్యాగన్ గ్రూప్ ప్రకటించింది. ఈ విస్తరణ ప్రణాళిక అమలు కోసం ఇంతకుముందు టాటా మోటార్స్ యాజమాన్యంతో చర్చలు జరిపింది. కానీ తదుపరి చర్చలు ముందుకు సాగలేదని బెర్న్ హార్డ్ మెయిర్ చెప్పారు.