ముంబై: టాటామోటార్స్‌ భారత్‌లో టియాగో, టిగోర్‌ జేటీపీ మోడల్ కార్లను నూతన ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. 2019 మోడల్‌ టియాగో, టగోర్‌గా వీటిని తీసుకొచ్చింది. 

టియాగో జేటీపీ మోడల్‌ కారు ధర రూ.6.69 లక్షలు కాగా, టిగోర్‌ జేటీపీ మోడల్‌ కారు ధర రూ.7.59లక్షలుగా నిర్ణయించారు. జేటీపీ ఎడిషన్‌ కార్లు మరింత శక్తిని విడుదల చేస్తాయి. టాటా మోటార్స్‌-జయిమ్‌ ఆటోమొబైల్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన జేటీ స్పెషల్‌ వెహికల్స్‌ కింద వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. 

మార్కెట్లోకి ఈ కార్ల విడుదల కార్యక్రమంలో జేటీఎస్‌వీ సీఈవో నాగభూషణ్‌ గుబ్బి మాట్లాడుతూ ‘జేటీపీ కొత్త కార్లను మార్కెట్లోకి విడుదల చేయడం ఆనందంగా ఉంది. గత ఏడాది కొత్తదనం కోసం జేటీపీ బ్రాండ్‌ను ప్రారంభించాం. మెరుగైన కార్లను మార్కెట్లోకి తెస్తామన్న మాటను నిలబెట్టుకొంటాం’ అని పేర్కొన్నారు. కొత్త జేటీపీ ఎడిషన్‌ కార్లలో సరికొత్త సస్పెన్షన్‌  సెటప్‌, తక్కువ గ్రౌండ్‌ క్లియరెన్స్‌, వెడల్పు టైర్లు, బ్లాక్‌ షార్క్‌ ఫిన్‌ యాంటీనా, ఆటోఫోల్డ్‌ ఏఆర్‌ఎం లభిస్తాయి. 

పాత మోడల్ కార్లతో పోలిస్తే టైగోర్ మోడల్ కారు ధర రూ.30 వేలు పెరుగుతుంది. అదనపు ఫీచర్ల వాడకం అవసరమని అన్న అభిప్రాయం వినిపిస్తోంది. మోడిఫికేషన్లలో భాగంగా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, షార్క్ ఫిన్ యాంటేనా, సైడ్ స్కర్ట్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిల్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తోపాటు సేఫ్టీ ఫీచర్లలో భాగంగా డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సర్లు జత కలిశాయి. 

పాత మోడల్ టియాగో, టైగోర్ కార్లలో 5- అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ ప్లేతో 7.0 ఇంచ్ టచ్ స్క్రీన్ యూనిట్ విత్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, కన్వినియెంట్ పవర్ ఫోల్డింగ్ ఫంక్షన్ ఉన్నాయి. టైగోర్ జేటీపీలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ తాజా మోడల్ కారులో చూడొచ్చు. ఇంకా డ్రైవర్‌తోపాటు కో డ్రైవర్‌కు కూడా సీట్ బెల్ట్ వార్నింగ్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ కూడా లభిస్తాయి.