Tata Avinya: టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే.. ఎలా ఉందో చూశారా..?
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో థర్డ్ జెన్ వాహనాలను రూపొందించనుంది. తన సరికొత్త ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ టాటా అవిన్యను ఆవిష్కరించింది. అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు ఇది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇందులో. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్‌లో టాటా మోటార్స్ దీన్ని తీర్చిదిద్దుతోంది. అవిన్య కారుకు సంబంధించిన కాన్సెప్టువల్ మోడల్‌ను కంపెనీ యాజమాన్యం ఆవిష్కరించింది.
టాటా మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. దీనికి అవిన్య అని పేరు పెట్టింది. ఇది ఒక కొత్త ఎలక్ట్రిక్ కారు. రాబోయే రెండు సంవత్సరాల్లో 10 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఈ కొత్త కాన్సెప్ట్‌ను రివీల్ చేసింది. ఇది ప్రస్తుతానికి కాన్సెప్ట్ మాత్రమే. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై కంపెనీ భవిష్యత్ ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని చూసి చెప్పవచ్చు. దీని క్యాబిన్ చూడటానికి లాంజ్ తరహాలో ఉంది. ఈ కారును కొత్త ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు. హ్యాచ్‌బ్యాక్/సెడాన్/ఎంపీవీలను మిక్సీలో వేసి బయటకు తీసినట్లు ఉంది.
దీని డిజైన్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. సరికొత్త లైటింగ్ సిగ్నేచర్ కూడా ఇందులో చూడవచ్చు. ఈ లైన్స్ చూడటానికి సింపుల్‌గానే ఉన్నా ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. అవిన్య అనేది ఒక కాన్సెప్ట్ కారు. ఇందులో ప్రత్యేకమైన డోర్లు ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. కర్వ్ కాన్సెప్ట్ తరహాలో కాకుండా.. ఈ కారు మరింత అడ్వాన్స్‌డ్ డిజైన్‌తో లాంచ్ అయింది. టాటా త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయనుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో టాటానే ముందంజలో ఉంది. టాటాలో ఇప్పటికే నెక్సాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఉంది. త్వరలో ఆల్ట్రోజ్, పంచ్‌ల్లో కూడా ఎలక్ట్రిక్ వెర్షన్స్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
విద్యుత్ ఆధారిత వాహనాల తయారీపై టాటా మోటార్స్ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ సెగ్మెంట్‌పై భారీగా పెట్టుబడులు పెడుతోంది. బిలియన్ల కొద్దీ డాలర్లను దశలవారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించాలన కాన్సెప్ట్‌తో టాటా మోటార్స్ ఈ తరహా వాహనాల తయారీకి ప్రాధాన్యత ఇస్తోంది. ఈవీ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి తీసుకుని రానున్న హైఎండ్ కారు.. టాటా అవిన్య. దీనికి సంబంధించిన కొన్ని వివరాలను టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.
థర్డ్ జనరేషన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న ఈ మొదటి ఎలక్ట్రిక్ వాహనం దేశీయ మార్కెట్‌లోకి విడుదల కావడానికి ఇంకో మూడేళ్ల సమయం పట్టొచ్చు. 2025 నాటికి ఇది అందుబాటులోకి రావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ కారు పొడవు 4.3 మీటర్లు. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని ప్రస్ఫూటింపజేసేలా ఈ కారు ముందు, వెనుక భాగాల్లో టీ- షేప్‌లో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లను అమర్చింది కంపెనీ మేనేజ్‌మెంట్.
లగ్జరీ వాహనం రోల్స్ రాయిస్ వంటి కార్ల తరహాలో డోర్స్‌ను డిజైన్ చేసింది కంపెనీ. స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుందీ కారు. డ్యాష్‌బోర్డ్ మొత్తం ప్లెయిన్‌గా ఉంటుంది. సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ దీని స్పెషాలిటీ. ఈ కారుకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు, బ్యాటరీ కెపాసిటీ వంటి సమాచారాన్ని టాటా మోటార్స్ యాజమాన్యం ఇంకా వెల్లడించాల్సి ఉంది. 500 కిలోమీటర్ల రేంజ్‌తో దీన్ని తీర్చిదిద్దుతున్నందున హెవీ కెపాసిటీ బ్యాటరీలను అమర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.