న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ సుజుకీ మోటార్ సైకిల్ సంస్థ నుంచి విడుదలైన జిక్సర్‌ 250 మోడల్‌ బైక్‌ భారత విపణిలోకి ప్రవేశించింది. దీని ధర రూ.1,59,800గా నిర్ణయించారు. మెటాలిక్‌ మ్యాటే ప్లాటినం సిల్వర్‌తో పాటు మెటాలిక్‌ మ్యాటే బ్లాక్‌ కలర్‌లో ఇది అందుబాటులోకి రానున్నది. 

సింగిల్‌ సిలిండర్‌ ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్ 249సీసీ సామర్థ్యం కలిగి ఉంది. ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్‌ మోటార్‌తో 26హెచ్‌పీ శక్తి, 22.6 న్యూటన్‌ మీటర్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది. రెండువైపుల డిస్క్‌ బ్రేక్‌లు ఉండడంతోపాటు అదనంగా యాంటీ లాక్ బ్రేకింగ్‌ సిస్టం సైతం ఏర్పాటు చేశారు. 

అత్యాధునిక ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్, డిజిటల్‌ మీటర్స్‌ బైక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న యమహా ఎఫ్‌జెడ్‌ 25, కేటీఎం 250 డ్యూక్‌కి పోటీగా సుజుకీ జిక్సర్‌ 250ని అందుబాటులోకి తెచ్చారు. 

సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా అధ్యక్షుడు హెడ్‌ కొచిరో హిరావ్‌ మాట్లాడుతూ అద్భుత ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన జిక్సర్‌ బ్రాండ్‌ని మరింత ఆధునికంగా, ఆకర్షణీయంగా, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో భాగంగానే సుజుకీ జిక్సర్‌ 250ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. 

అత్యుత్తమ నాణ్యత, ఉత్తమ ప్రమాణాలతో ఉండే సుజుకీ ద్విచక్రవాహనాల ఫీచర్లన్నీ జిక్సర్‌ 250లోనూ ఉంటాయని సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా అధ్యక్షుడు హెడ్‌ కొచిరో హిరావ్‌  అన్నారు. వినియోగదారులకు థ్రిల్‌నందించే క్రమంలో రూపొందించిన ఈ బైక్‌లో స్టైల్‌, సామర్థ్యం విషయంలో ఏమాత్రం రాజీపడలేదన్నారు.

జిక్సర్‌ 250 మోడల్‌లో ఫోర్‌-స్ట్రోక్‌ 249 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. భారత విపణి కోసమే ప్రత్యేకంగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. డ్యూయల్‌ ఛానల్‌ యాంటీ లాక్‌ బ్రేక్‌ వ్యవస్థ (ఏబీఎస్‌) కలిగిన 6- స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో బ్రేకింగ్‌ సామర్థ్యం మెరుగైందని తెలిపింది.

‘అధిక పనితీరు కలిగిన మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేయడంలో సుజుకీ నిబద్ధతకు జిక్సర్‌ 250 నిదర్శనం. కట్టింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీతో మంచి పనితీరు అందిస్తుంది. జిక్సర్‌ పోర్ట్‌ఫోలియోలో తాజా జోడింపుతో వృద్ధి జోరు కొనసాగిస్తాం’ అని సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా హెడ్‌ కొచిరో హిరావ్‌ తెలిపారు. గత అయిదేళ్లలో జిక్సర్‌ బ్రాండ్‌ దూసుకెళ్తోందని అన్నారు.