ముంబై: ప్రముఖ జపాన్ ఆటోమొబైల్ సంస్థ అనుబంధ సుజుకీ మోటార్స్  సైకిల్ ఇండియా  ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లోకి సరికొత్త యాక్సిస్ 125 సీసీ వేరియంట్ బైక్ తీసుకొచ్చింది. డ్రమ్ బ్రేక్-అలాయ్ వీల్స్ కలిగి ఉండటం ఈ బైక్ ప్రత్యేకత. 

అలాయ్ వీల్స్ ఆప్షన్‌కు డిమాండ్ పెరగడంతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చామని సుజుకి తెలిపింది. దీని ధర రూ.59,891గా నిర్ణయించారు. సుజుకీ యాక్సిస్ 125 స్పెషల్ ఎడిషన్‌లో ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ ఉన్న వేరియంట్ ధర రూ.61,788గా నిర్ణయించారు. 

‘మేము అలాయ్ వీల్స్తో సరికొత్త డ్రమ్బ్రేక్ యాక్సిస్ వేరియంట్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సంతోషిస్తున్నాము. వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని దీనిని మార్కెట్లోకి విడుదల చేశాం’ అని సుజుకీ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు దేవేష్ హాండా చెప్పారు. 

యాక్సిస్ 125 ఎస్ఈ బైక్ కు తాము చిన్నచిన్న మార్పులతో పాటు.. వాహన అందానికి మెరుగులుదిద్దుతూ మార్కెట్లోకి తీసుకువచ్చినట్టు కంపెనీ తెలిపింది. కొత్త సుజుకీ యాక్సిస్ 125 అల్యూమినియం 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, 124 సీసీ ఇంజిన్తో లభిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఇంజిన్ ఎం-స్విష్ కంబషన్ ఛాంబర్తో మేటి శక్తిని అందిస్తుందని వెల్లడించింది. 

కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్తో పాటు సెంట్రల్ లాకింగ్ అండ్ సేఫ్టీ షట్టర్ సెక్యూరిటీ, ఈజీ స్టార్ట్ సిస్టమ్, లాంగ్సీట్, హెడ్ ల్యాంప్ చుట్టూ క్రోమ్ ఫినిష్, డిజిటల్ మీటర్, ఆయిల్ చేంజ్ ఇండికేటర్, డ్యూయల్ ట్రిప్ మీటర్ ఈ వాహనంలోని ఇతర ప్రత్యేకతలు. స్పెషల్ ఎడిషన్ యాక్సిస్ వాహనం కలర్ సీటుతో క్రోమ్ ఫినిష్ రేర్ వ్యూ అద్దాలతో అందుబాటులోకి తెచ్చామని సంస్థ వివరించింది.