న్యూఢిల్లీ: దేశీయంగా ఆటోమొబైల్‌ రంగం సంక్షోభం ముంచుకొస్తోంది. గత కొన్ని నెలలుగా నెలకొన్న మందగమన పరిస్థితులు తీవ్రరూపం దాల్చటంతో ఆటోమొబైల్‌ కంపెనీలు మరో గత్యంతరం లేక మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. 

టీవీఎస్‌ గ్రూప్‌నకు చెందిన ఆటో కాంపోనెంట్‌ తయారీదారు సుందరం- క్లేటాన్‌ లిమిటెడ్‌ (ఎస్‌సీఎల్‌), ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌ తమ ప్లాంట్లను మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. మరోవైపు దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ భారీగా తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 

దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి నానాటికి తగుముఖం పడుతుండటంతోపాటు జీఎస్టీ, వచ్చే ఏడాది నుంచి బీఎస్‌-6 ప్రమాణాలు అమల్లోకి రానుండటం దేశీయ ఆటోమొబైల్‌ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే అమ్మకాలు లేక నిల్వలు పేరుకుపోవటంతో ఉత్పత్తిని నిలిపివేయటం మినహా ఆటో కంపెనీలకు మరో మార్గం లేక పోయింది. 

ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో ఇప్పటికే నేరుగా 15 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, పరోక్షంగా మరో రెండు లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆటోమొబైల్‌ పరిశ్రమల సమాఖ్య సియామ్‌ తెలిపింది. అంతేకాక దేశవ్యాప్తంగా 300కు పైగా డీలర్‌షిప్‌లు మూతపడ్డాయని తెలిపింది.

ఆటో కాంపోనెంట్‌ తయారీదారు సుందరం క్లేటాన్‌ లిమిటెడ్‌ (ఎస్‌సీఎల్‌)  తమిళనాడులోని పాడి ఫ్యాక్టరీని 2 రోజులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ఆటోమోటివ్‌ ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్ మాన్యు ఫ్యాక్చరర్స్‌ (ఓఈఎం)కు అల్యూమినియం డై కాస్ట్‌ ఉత్పత్తులను ఎస్‌సీఎల్‌ సరఫరా చేస్తోంది. 

ఆటోమొబైల్‌ విభాగంలోని అన్ని రంగాల్లో నెలకొన్న మందగమనం కారణంగా ప్లాంట్‌లో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఎస్‌సీఎల్‌ తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిని తగ్గించుకోవటం మినహా మరో మార్గం లేదని ఇందులో భాగంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
 
ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌ తన ఉత్పత్తి కేంద్రాలను నాలుగు రోజులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకోవటంతో పాటు వార్షిక సెలవుల క్యాలెండర్‌కు అనుగుణంగా ఈ నెల 15 నుంచి 18 వరకు మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. డిమాండ్‌ లేక నిల్వలు పెరిగిపోవటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని హీరో మోటో పేర్కొంది.

ఆటో కాంపోనెంట్స్‌ తయారీ సంస్థ బాష్‌ లిమిటెడ్‌ ఇప్పటికే తమిళనాడు, గంగైకొండన్‌, మహారాష్ట్రలోని నాసిక్‌ ప్లాంట్లలో 13 రోజుల పాటు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసింది. భారత ఆటోమొబైల్‌ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, భవిష్యత్‌ ముఖచిత్రం కూడా అంత ఆశాజనకంగా కనిపించటం లేదని బాష్‌ లిమిటెడ్‌ ఎండీ సౌమిత్రా భట్టాచార్య అన్నారు.

మానవ వనరుల సర్దుబాటు, నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచటం వంటి వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్లాంట్లను మూసివేసినట్లు చెప్పారు. కాగా డిమాండ్‌ లేకపోవటంతో అందుకుతగ్గట్టుగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేయాలని చూస్తున్నట్లు టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించాయి.

ఆటో పరిశ్రమలో రోజుకురోజుకు మందగమన పరిస్థితులు పెరిగిపోతుండటంతో దాదాపు 3000 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించినట్లు మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తెలిపింది. రోజురోజుకు పరిస్థితులు దిగజారి పోతుండటంతో తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను పునరుద్ధరించలేదని మారుతి సుజుకి చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ తెలిపారు. 

శాశ్వత ఉద్యోగులపై మాత్రం వేటు వేయలేదని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. ఆటో పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులతో రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని భార్గవ హెచ్చరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప పరిస్థితి గాడిలో పడే అవకాశం లేదన్నారు.