జేఎల్ఆర్‌లో సెలెక్టెడ్ మోడల్స్ ధరలు పైపైకే.. ఒకటో తేదీ నుంచి అమలు

టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థ ఎంపిక చేసిన మోడల్ కార్ల ధరలను పెంచనున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధరల పెంపు అమలులోకి వస్తుందని పేర్కొంది. 

Select JLR Models To Cost More From April

టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ ఇండియా (జేఎల్ఆర్)లో కొత్త మోడల్ కారు కొనుగోలు చేయాలని తలపోస్తున్న వారు అదనపు భారం మోసేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అవును మరి ఆ సంస్థ ఎంపిక చేసిన కొన్ని కార్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆయా మోడల్ కార్లపై ధరలు నాలుగుశాతం వరకూ పెరిగాయని తెలిపింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ధరల పెరుగుదల అమలులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ధరలు పెంచినట్లు జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సూరి పేర్కొన్నారు. జేఎల్‌ఆర్‌ ఇండియా జాగ్వార్‌, లాండ్‌ రోవర్‌ బ్రాండ్లతో కార్లను విక్రయిస్తోంది. ఏయే మోడళ్ల ధరలను పెంచిందీ కంపెనీ వెల్లడించలేదు. 

జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థ భారతదేశంలో రెండు బ్రాండ్లతో కలిపి 11 మోడల్ కార్లను విక్రయిస్తోంది. జాగ్వార్‌ ఎక్స్‌ఈ ధర రూ.40.61 లక్షల నుంచి ప్రారంభం అవుతుండగా, రేంజ్‌ రోవర్‌ ధర రూ.1.79 కోట్లుగా, టాప్ ఆఫ్ ది లైన్ రేంజ్ రోవర్ ఎస్ యూ ఆటోబైబోగ్రఫీ మోడల్ ధర రూ.4 కోట్లుగా ఉంది. 

భారతదేశంలో జాగ్వార్ ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్, ఎక్స్ జే, ఎఫ్- పేస్, ఎఫ్ టైఫ్ మోడల్ కార్లు ఉత్పత్తి చేస్తున్నది. డిస్కవరీ స్పోర్ట్ అండ్ రేంజ్ రోవర్ ఎవోక్యూతోపాటు రేంజ్ రోవర్ వేలార్, రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ అండ్ డిస్కవరీ మోడల్ కార్లను తయారు చేస్తోంది. భారతదేశంలో 25 నగరాల పరిధిలోని 27 ఔట్‌లెట్లలో విక్రయిస్తోంది. 

44 వేల కార్లను రీకాల్ చేసిన జాగ్వార్ లాండ్ రోవర్ 

కర్బన ఉద్గారాల సమస్యలను పరిష్కరించేందుకు జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) 2016-19 మధ్య విక్రయించిన 44 వేలకు పైగా కార్లను రీకాల్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో విడుదల చేసిన అన్ని మోడల్ కార్లు 2.0 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్, డీజిల్ వేరియంట్లను రీకాల్ చేస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల స్థాయి ఎక్కువగా ఉన్నందు వల్లే వాటిని రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఆ కార్లలో సాఫ్ట్ వేర్ మార్చడంతోపాటు మరమ్మత్తులు పూర్తి చేసి వినియోగదారులకు తిరిగి అందజేయనున్నది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios