ఆటో రంగానికి రోజుకు రూ.2300 కోట్ల లాస్.. బీఎస్-6 అమలు మరో ప్రాబ్లం
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాపించకుండా దేశీయంగా విధించిన లాక్ డౌన్ ఆటోమొబైల్ రంగాన్ని కంట నీరు పెట్టిస్తోంది.
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాపించకుండా దేశీయంగా విధించిన లాక్ డౌన్ ఆటోమొబైల్ రంగాన్ని కంట నీరు పెట్టిస్తోంది. వివిధ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు, విడి భాగాల సంస్థలు లాక్ డౌన్, దానికి ముందే తమ ప్లాంట్లలో ఉత్పత్తిని మూసివేశాయి.
ఫలితంగా ఆటోమొబైల్ రంగానికి రోజుకు రూ.2300 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని ఆటో ఇండస్ట్రీ బాడీ ‘సియామ్’ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రకారం మూడు వారాల లాక్ డౌన్ వల్ల రమారమీ రూ.48 వేల కోట్ల పై చిలుకు నష్టం వాటిల్లుతుందని అంచనా.
ప్రయాణికుల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దక్షిణ కోరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ ఇండియా, హోండా కార్స్, మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్స్, టాటా మోటార్స్, కియా మోటార్స్, ఎంజీ మోటార్స్ ఇండియా తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపేశాయి.
ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు హీరో మోటో కార్ప్స్, హోండా మోటారు సైకిల్స్, బజాజ్ ఆటోమొబైల్స్, టీవీఎస్ మోటారు సైకిల్స్, యమహా మోటారు సైకిల్స్, సుజుకి మోటారు సైకిల్స్ తదితర సంస్థలు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసిన సంస్థల్లో ఉన్నాయి. వీటిలో ఈ నెలాఖరు వరకు ప్రొడక్షన్ తాత్కాలికంగా నిలిపేసిన సంస్థలు ఉన్నాయి.
‘ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు, వాటి విడి భాగాల తయారీ సంస్థలు ఉత్పత్తిని నిలిపివేయడం వల్ల రోజుకు రూ.2300 కోట్లకు పైగా నష్ట పోవాల్సి వస్తుందని సియాం అంచనా వేసింది’ అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) అధ్యక్షుడు రాజన్ వధేరా ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రధాన ఆటోమొబైల్ సంస్థలతోపాటు టైర్ల తయారీ సంస్థలు, ఆటో విడి భాగాల సంస్థలను ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లను మూసివేశాయి. ఆటోమొబైల్ రంగ నష్టాలకు కేవలం కరోనా వైరస్ ఒక్కటే కారణం కాకపోవచ్చు.
కరోనా వైరస్ ప్రభావం అనుభవంలోకి రాక ముందే ఆటోమొబైల్ రంగం ఒక ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి బీఎస్-4 వాహనాల విక్రయం నిలిపేయాలని సుప్రీంకోర్టు, కేంద్రం ఆదేశించాయి. అఫ్ కోర్స్. సుప్రీంకోర్టు 10 రోజుల విరామం ఇచ్చింది. అదే వేరే సంగతి. ఏడాది కాలంగా విక్రయాలు లేక ఆటోమొబైల్ రంగం కునారిల్లుతున్నది.
ద్విచక్ర వాహన కంపెనీల వారెంటీ పొడగింపు
లాక్‌డౌన్ నేపథ్యంలో కస్టమర్ల కోసం వారెంటీ గడువులను యమహా, టీవీఎస్ సంస్థలు పొడిగించాయి. లైఫ్ టైమ్ క్వాలిటీ కేర్ సౌకర్యాన్ని 60 రోజులు పొడిగిస్తున్నట్లు ఇండియా యమహా మోటార్స్ ప్రకటించింది. ఏప్రిల్ 15 వరకు ఉచిత సర్వీసు గడువును, జూన్ వరకు సాధారణ వారెంటీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. అలాగే మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్య ముగిసే వార్షిక మెయింటేనెన్స్ కాంట్రాక్టులనూ జూన్‌దాకా పొడిగిస్తున్నామన్నది.
also read:ఎల్పీజీ సహా ఏ ఇంధన కొరత కూడా లేదు.. తేల్చేసిన ఐఓసీ
ఇక టీవీఎస్ మోటార్ సైతం మార్చి, ఏప్రిల్ మధ్య ఉంటే ఫ్రీ సర్వీస్ సదుపాయాన్ని జూన్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్ల సహాయార్థం 18002587111 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది.