Renault India: భారత్‌లో రెనాల్ట్ అరుదైన మైలురాయి.. భారీగా విక్రయాలు
భారత్‌లో రెనాల్ట్ ఇండియా అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి. ఈ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ఏకంగా భారత్‌లో 8 లక్షలకు పైగా కార్లను విక్రయించింది.
మార్కెట్‌లో కార్ల హవా కొనసాగుతోంది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది కారు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కార్లను తయారు చేస్తున్న కంపెనీలు మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. భారత్‌లో రెనాల్ట్ ఇండియా అమ్మకాల్లో అరుదైన మైలురాయి చేరుకుంది. ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ భారత్‌లో 8 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. పదేండ్ల కిందట భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన రెనాల్ట్ దేశీ ఆటోమొబైల్ మార్కెట్‌లో అరుదైన ఘనతను సాధించింది. ప్రస్తుతం రెనాల్ట్ ఇండియా భారత్‌లో రెనాల్ట్ కైగర్, క్విడ్, ట్రైబర్, డస్టర్ వంటి నాలుగు కార్లను విక్రయిస్తోంది.
భారత్‌లో తాము 8 లక్షల కార్ల విక్రయాలను అధిగమించి అరుదైన మైలురాయి చేరుకున్నామని రెనాల్ట్ ఇండియా సీఈఓ, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. ఈ ఘనతను సాధించేందుకు తమకు సహకరించిన కస్టమర్లు, డీలర్లు, సరఫరాదారులు, ఉద్యోగులకు తమ బ్రాండ్ తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత కొన్నేండ్లుగా భారత్‌లో తాము పటిష్ట పునాదిని ఏర్పరచుకున్నామని, పటిష్ట ప్రోడక్ట్ వ్యూహాలతో కస్టమర్లకు మెరుగైన డ్రైవింగ్ అనుభూతి అందించేలా అన్ని విభాగాల్లో మెరుగైన సేవలందించామని చెప్పారు.
ఇవన్నీ భారత్‌లో రెనాల్ట్ గ్రోత్ కి సహకరించాయని వివరించారు. చెన్నైలోని తమ అత్యాధునిక తయారీ ప్లాంట్, టెక్నాలజీ సెంటర్, లాజిస్టిక్స్, డిజైన్ సెంటర్ల వెన్నుదన్నుతో రెనాల్ట్ ఇండియా పోర్ట్‌పోలియో విజయవంతమైందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో పాటు రవాణా సమస్యలు ఎదురైనా 2021లో కంపెనీ అద్భుత వృద్ధి కనబరిచిందని చెప్పారు. రెనాల్ట్ గ్లోబల్ సేల్స్‌లో భారత్ టాప్ ఫైవ్ గ్లోబల్ మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని తెలిపారు.