న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీసుజుకీ ఇండియా లిమిటెడ్ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. వచ్చే సంవత్సరంలో మరో రెండు కొత్త మోడళ్లలో కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ పేర్కొన్నది. 

వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ కన్నా ముందే బీఎస్-6 పెట్రోల్ వెర్షన్‌లో సరికొత్త ఫీచర్లతో రెండు కొత్త మోడళ్లు బ్రెజ్జా, ఎస్-క్రాస్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో వీటిని మార్కెట్లోకి తేనున్నట్టు కంపెనీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు.

also read  4 సంవత్సరాలలో మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు ఎంతో తెలుసా..?

దేశ ఆటోమొబైల్ పరిశ్రమ మందగమనం నుంచి బయటపడానికి ఆటో తయారీదారులు మరో రెండు-మూడు నెలలు వేచి ఉండాల్సి ఉంటుందని మారుతి సుజుకి కంపెనీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ  తెలిపారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి బీఎస్‌-6 నిబంధనలు అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ బ్రెజ్జా, ఎస్‌-క్రాస్‌ డీజిల్‌ వెర్షన్లను మాత్రమే విక్రయిస్తోంది.

ప్రస్తుతం కంపెనీ డీజిల్ వెర్షన్‌లో బ్రెజ్జా, ఎస్-క్రాస్ కార్లను విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. గత ఏడు నెలల్లో మూడు లక్షల బీఎస్-6 కార్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. అక్టోబర్‌లోనే కంపెనీ దాదాపు లక్ష వాహనాలను విక్రయించింది. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల ధరలు ఎక్కువైనా వినియోగదారుల నుంచి ప్రోత్సాహం లభిస్తోందని మారుతి సుజుకి తెలిపింది. 

బీఎస్-4 ప్రమాణాలతో కూడిన ఎనిమిది మోడళ్ల కార్ల ఉత్పత్తిని నిలిపివేశామని మారుతి సుజుకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న వాహనాల ధరలు ఆయా మోడళ్లను బట్టి రూ.8000-రూ.10,000 ఎక్కువ పలుకుతున్నాయని తెలిపారు. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్ల విక్రయాలే 70 శాతం ఉన్నాయని చెప్పారు.

also read కేవలం నెలలోనే టాప్-10లో మారుతి ఎస్-ప్రెస్సోకు చోటు

వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్-4 ప్రమాణాలతో కూడిన వాహనాలను అనుమతించే ప్రసక్తే లేదని మారుతి సుజుకి తేల్చి చెప్పింది. దీపావళి పండుగ నిల్వల ఒత్తిడి తగ్గించిందన్నారు. ప్రస్తుతం బీఎస్-6 మోడల్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపింది. బీఎస్-6 ప్రమాణాల క్యాటగిరీలోకి బాలెనో, ఆల్టో 800, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, ఎక్స్ఎల్6, ఎస్-ప్రెస్సో కార్ల పెట్రోల్ వేరియంట్లు వచ్చేశాయి.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అలాగే అన్ని రకాల డీజిల్ వేరియంట్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తామని మారుతి తెలిపింది. డీజిల్ బ్రెజ్జా, ఎస్-క్రాస్ మోడల్ కార్లు కొన్ని నెలలు ఉత్పత్తి చేసినా ఏప్రిల్ నుంచి నిలిచిపోతాయన్నారు. వచ్చే త్రైమాసికంలో ఈ మోడల్ కార్లను పెట్రోల్ వేరియంట్ (బీఎస్-6) కార్లను ఆవిష్కరిస్తామని చెప్పారు.