న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వాహన విక్రయాలు స్తబ్దుగా నమోదు కావొచ్చని భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) అంచనా వేస్తోంది. కార్ల విక్రయాలు కేవలం 3-5 శాతం మేర మాత్రమే వృద్ధి చెందవచ్చని అంటోంది. 

కాలుష్య నియంత్రణ ప్లస్ సేఫ్టీ చర్యలు తీసుకునేందుకు అమలు చేయనున్న భారత్‌ స్టేజ్ ‌(బీఎస్‌)-6 నిబంధనలకు అనుగుణంగా వాహనాల తయారీ పరివర్తన చెందే విషయంలో అనిశ్చితి, ఎన్నికల ఫలితాలు పరిశ్రమపై ప్రభావం చూపుతాయని చెబుతోంది. 2018-19 లోనూ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు రెండు శాతానికే పరిమితం అయ్యాయి.

ప్రస్తుత బలహీన సెంటిమెంట్‌కు తోడు ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షపాతం నమోదు అవుతుందన్న అంచనాలు కూడా వాహన అమ్మకాలపై ఒత్తిడి తేనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వాణిజ్య వాహనాలు 10-12%, ద్విచక్ర వాహనాలు 5-7%, త్రిచక్ర వాహనాల విక్రయాలు 7-9% మేర వృద్ధి సాధిస్తాయని సియామ్‌ అంచనా కడుతోంది.

‘గత ఏడాది కాలంగా విధానపరంగా అనిశ్చిత వాతావరణం నెలకొన్నది. దీనికి తోడు నియోగదార్ల సెంటిమెంట్ కూడా బలహీనంగానే కనిపిస్తోంది. అయినా ఈ సవాళ్లన్నిటినీ వాహన పరిశ్రమ అధిగమించగలదు’అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌ పేర్కొన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 2.7 శాతమే పెరిగి 33.8 లక్షలకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు 4.9% వృద్ధితో 2.11 కోట్లకు చేరుకున్నాయి. 

ఇక వాణిజ్య వాహనాలు రెండంకెల (17.6 శాతం) వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఇక ఈ ఏడాది ప్యాసింజర్ వాహనాలు, మధ్య, భారీ స్థాయి వాణిజ్య వాహనాల అమ్మకాలు 5-9% మేర, తేలికపాటి వాణిజ్య వాహనాలు, త్రిచక్ర వాహనాల్లో రెండంకెల వృద్ధి నమోదు కావొచ్చని సియామ్‌ అంచనా వేస్తోంది.

2018-19లో 67 లక్షల స్కూటర్లను కంపెనీలు విక్రయించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 0.3% తక్కువ. గత నాలుగేళ్లలోనే అధ్వాన వృద్ధి ఇది. కాగా, మోటార్‌సైకిళ్లతో పోలిస్తే స్కూటర్ల విక్రయాలు పెరుగుతాయన్న అంచనాలైతే ఉన్నాయి.

సవాళ్లు ఎదురైనా గత ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహన అమ్మకాలు 4.9% పెరిగాయి. రెండంకెల వృద్ధి నమోదు అవుతుందన్న అంచనాలు తారుమారయ్యాయి. 2019-20లో ఈ విభాగంలో 5-7% వృద్ధి నమోదవగలదని సియామ్‌ అంచనా వేసింది.

మార్కెట్లోకి నూతన వాహనాల విడుదలైనా.. గతేడాది ద్వితీయార్థంలో గణనీయంగా తగ్గిన అమ్మకాల కారణంగా కనీసం అంచనాలకు దగ్గరగా కూడా విక్రయాలు చేరుకోలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది ప్రారంభంలో 8 నుంచి 10 శాతం వరకు విక్రయాల్లో వృద్ధి ఉంచవచ్చని సియామ్‌ అంచనా వేసింది.

మారిన పరిస్థితుల రీత్యా వాహనాల విక్రయాలు ఆరు శాతానికి పెరుగుతాయని పేర్కొంటూ సియామ్ అంచనాలను సవరించింది. అయితే, ఈకాలంలో ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) తగ్గడం, అధిక వాహన ధరలు, సాధారణ ఎన్నికల కారణంగా ఏర్పడిన అనిశ్చితి వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో పూర్తిఏడాది అమ్మకాలు 2.7 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి.

వృద్ధిరేటు సింగిల్ డిజిట్‌కు పరిమితం అయ్యిందా, లేదంటే డబుల్ డిజిట్ వృద్ధిరేటా అనే విషయాన్ని పక్కన పెడితే.. గతేడాదిలో కూడా వృద్ధి కొనసాగిందని సియామ్ అధ్యక్షుడు రాజన్‌ వదేరా అన్నారు. గతేడాదిలో కూడా వృద్ధి కొనసాగింది. అధిక ముడివస్తువుల ధరల కారణంగా పరిశ్రమ గతేడాదిలో అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు.

వెహికల్స్ సేల్స్ విషయంలో బీఎస్‌-6 ట్రాన్స్ ఫర్మేషన్ మరో కీలక అంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఏడాది అమ్మకాలు 3 నుంచి 5 శాతం మధ్య ఉండవచ్చని అంచనావేస్తున్నామని సియామ్ అద్యక్షుడు రాజన్ వధేరా అన్నారు. దేశ అర్థిక అభివృద్ధిపై పాజిటివ్‌గా ఉన్నామన్నారు.  

దేశీ కార్ల విక్రయాల్లో గతేడాది స్వల్ప వృద్ధిరేటు నమోదైంది. 2018–19లో 22,18,549 కార్లు అమ్ముడు కాగా, అంతక్రితం ఏడాదిలో 21,74,024 యూనిట్లు అమ్ముడయ్యాయి. యుటిలిటీ వాహనాలు (యూవీ) విక్రయాలు 2.08 శాతం వృద్ధితో 9,41,461 యూనిట్లుగా నిలిచాయి. మొత్తం ప్యాసింజర్‌ వాహనాల ఎగుమతుల్లో 9.64 శాతం క్షీణత నమోదైంది.  

ఈ నేపథ్యంలో ప్రయాణికుల-ద్విచక్ర వాహనాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ప్రభుత్వానికి వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) విజ్ఞప్తి చేసింది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 నిబంధనల అమలుకు వాహన ధరలను 10-15 శాతం పెంచాల్సి వస్తుందని, ఈ భారం ప్రజలపై పడకూడదంటే, జీఎస్టీని తగ్గించాలని అభ్యర్థించింది. 

ఇప్పటికే గిరాకీ తగ్గి, వాహన నిల్వలు తయారీదార్ల వద్ద పోగుబడుతున్న నేపథ్యంలో, ధరలు పెరిగితే మరింత ఇబ్బంది ఏర్పడుతుందని సియామ్‌ అభిప్రాయ పడింది. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్టీతో పాటు వెహికల్, ఇంజిన్‌ సామర్థ్యాన్ని బట్టి 1-15 శాతం వరకు సెస్‌ కూడా విధిస్తున్నారని సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా గుర్తు చేశారు. వాహన అమ్మకాలు తగ్గితే, ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా క్షీణిస్తుందన్నారు. అందరికీ మేలు కలిగేలా జీఎస్టీని తగ్గించాలని కోరారు.