న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కాలంగా అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలకు స్వల్ప ఊరట లభించింది. గత నెలలో నూతన వాహనాలు మార్కెట్లోకి అందుబాటులోకి రావడం, పండుగ సెంటిమెంట్ తోడవడంతో అమ్మకాల్లో వృద్ధి నమోదైందని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించింది. 

వరుసగా 11 నెలలుగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థలకు అక్టోబర్‌లో 0.28 శాతం పెరుగుదల నమోదైంది. తాజాగా సియామ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత నెలలో 2,85,027 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇది 2,84,223గా ఉన్నాయి. 

గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వరుసగా 11 నెలలుగా అమ్మకాలు అంతకంతకు పడిపోతూ వచ్చాయి. గత నెలలో మొత్తంగా వాహన విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 12.76 శాతం పడిపోయి 21,76,136లకు జారుకున్నాయి.

aslo read జావా పెరాక్ బాబర్-స్టైల్ బైక్ లాంచ్

2018 అక్టోబర్ నెలలో 24,94,345 అమ్ముడయ్యాయి. యుటిలిటీ, ప్యాసింజర్, త్రిచక్ర వాహన అమ్మకాలు మాత్రం పడిపోయాయి. దేశ వ్యాప్తంగా కార్ల అమ్మకాలు 6.34 శాతం తగ్గి 1,73,649 యూనిట్లకు పడి పోయాయి. గతేడాది 1,85,400 యూనిట్లు అమ్ముడు పోయాయి. 

యుటిలిటీ వాహన విక్రయాలు మాత్రం ఏడాది ప్రాతిపదికన 22.22 శాతం పెరిగి 1,00,725లకు చేరుకోవడం విశేషం. అంతక్రితం ఏడాది 82,413లు ఉన్నాయి.ద్విచక్ర వాహన అమ్మకాలు 14.43 శాతం పడిపోయి 17,57,264 యూనిట్లకు జారుకున్నాయి. గతేడాది ఇది 20,53,497గా ఉన్నాయి.

మోటార్‌సైకిల్ విక్రయాలు 15.88 శాతం పతనం చెంది 11,16,970లకు పడిపోగా, స్కూటర్స్ అమ్మకాలు 9.83 శాతం తగ్గి 5,80,120లకు జారుకున్నాయి.వాణిజ్య వాహన అమ్మకాలు కూడా ఏడాది ప్రాతిపదికన 23.31 శాతం తగ్గి 66,773లకు పడిపోయాయి.

ఏప్రిల్-అక్టోబర్ మధ్య ప్రయాణ వాహనాల విక్రయాలు 20 శాతం తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి విక్రయాల సమాచారం అందలేదు.ప్రయాణ వాహనాల విక్రయాల్లో మారుతి సుజుకీ 2.33 శాతం పెరిగాయి.

కానీ హ్యుండాయ్ మోటర్ 3.82 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 23.33 శాతం పతనం చెందాయి. ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటోకార్ప్ 18.03 శాతం పతనం చెందాయి.హోండా మోటర్‌ సైకిల్, టీవీఎస్ అమ్మకాలు 25.46 శాతం పతనం చెందాయి.

మొత్తంగా గత నెలలో 18,16,440 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 16,82, 995 యూనిట్లతో పోలిస్తే 8% పెరిగాయి.ప్రస్తుత పండుగ సీజన్‌లో వాహన విక్రయాలు గతేడాదితో పోలిస్తే ఆశాజనకంగా ఉన్నాయి.

ఇది నవంబర్, డిసెంబర్‌ నెలల్లోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వాధేరా తెలిపారు. నూతన మోడళ్లు విడుదల కావడం, రుణ రేట్లు తగ్గుముఖం పట్టడం కూడా యుటిలిటీ వాహన విక్రయాలకు జోష్‌నిచ్చిందన్నారు.

aslo read సంక్రాంతికి బీఎస్ 6 ప్రమాణాలతో ఆడీ క్యూ 8 ఆవిష్కరణ

గతేడాదితో పోలిస్తే ప్రస్తుత రెండు నెలల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ఆశాజనకంగా ఉండనున్నది. ఇదే క్రమంలో వచ్చే త్రైమాసికంలో విక్రయాలు పెరిగే అవకాశాలున్నాయని రాజన్ వధేరా పేర్కొన్నారు.

దేశ ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉండటంతో వాణిజ్య వాహన విక్రయాలకు బ్రేక్ పడిందని, ఇటీవల కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఇచ్చిన రూ.25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు భవిష్యత్‌లో డిమాండ్‌ను పెంచేందుకు దోహదం చేయనున్నాయన్నారు.