Okinawa Dealership Burns: పేలుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్.. వాహనాలను రీకాల్ చేస్తున్న కంపెనీ..!
ఒకినావా కంపెనీకి (Okinawa dealership) చెందిన ఈ- స్కూటర్‌లో మంటలు చెలరేగడంతో ఆటోటెక్ డీలర్ షిప్ మొత్తం కాలి బూడిదైంది. ఈ తాజా ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. స్థానికుల సహకారంతో మంటలు షోరూమ్ నిర్వాహకులు అదుపుచేశారు.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీ)లో మంటలు చెలరేగుతున్నాయి. పార్క్ చేసిన వెహికిల్, ఛార్జింగ్ పెట్టిన స్కూటర్... ఇలా పలు ఈవీలు అగ్గికి ఆహుతైన సంఘటనలను మనం విన్నాం. ఈ నేపథ్యంలో.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీదారి ఒకినావా ఆటోటెక్ ముందస్తు జాగ్రత్తగా తన ప్రైజ్ ప్రోకు చెందిన 3,215 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. బ్యాటరీలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయడం ఈ రీకాల్ ప్రక్రియను చేపట్టింది ఒకినావా సంస్థ. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. కనెక్టర్లు ఎక్కడైనా లూజ్‌గా ఉన్నాయా లేదా బ్యాటరీల్లో ఏమైనా డ్యామేజ్ ఉందా తెలుసుకోవడం కోసం ఈ రీకాల్ ప్రక్రియను చేపడుతున్నట్టు కంపెనీ చెప్పింది. ఈ చెకింగ్ ప్రక్రియల్లో ఏమైనా లోపాలు బయటపడితే దేశవ్యాప్తంగా ఉన్న ఒకినావా అథరైజ్డ్ డీలర్‌షిప్‌లలో ఎక్కడైనా ఉచితంగా బాగు చేయించుకోవచ్చు.
ఇటీవల ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో నెలకొన్న సంఘటనలతో వాలంటరీగా ఈ కార్యక్రమాన్ని ఒకినావా చేపడుతోంది. కంపెనీ దీర్ఘకాలిక నిబద్ధతకు అనుగుణంగా కస్టమర్ల సేఫ్టీకి తాము ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపింది. కస్టమర్ల సౌకర్యార్థం రిఫైర్ ప్రక్రియను చేపట్టేందుకు డీలర్ పార్టనర్లతో కలిసి ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ పనిచేస్తోంది. వెహికిల్ ఓనర్లతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతామని చెప్పింది.
దేశవ్యాప్తంగా పలు ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన సంఘటనలు తెలిసినవే. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గత నెలలో మంటలంటున్నాయి. ఈ సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ బ్యాటరీల్లో ఏమైనా సమస్యలున్నాయా? అనేది తెలుసుకుంటోంది. నాసిరకం బ్యాటరీలేమైనా కంపెనీలు వాడాయో లేదా మరేదైనా కారణం ఉందో కేంద్రం ప్రభుత్వం విచారిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో మంటలు చెలరేగడం ఈ మధ్యన ఎక్కువగా వార్తా పత్రికల ప్రధానాంశాలుగా మారడంతో.. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాహనాల భద్రతా ప్రమాణాలపై సోషల్ మీడియా యూజర్లు పలు సందేహాలను లేవనెత్తుతున్నారు. ఈ ఏడాది వేసవి ప్రారంభమైన తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జరగటం ఇది 6వ సారి. తమిళనాడులో డీలర్ షిప్ మంటల్లో కాలిపోవటానికి ముందు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒకినావా ఏప్రిల్ 16న.. ప్రైజ్ ప్రో మోడల్ కు చెందిన 3,215 యూనిట్ల స్కూటర్లను రీకాల్ చేసింది.