మిక్సర్ పొట్లాం: బైక్‌లు ప్లస్ స్కూటర్ల సేల్స్ తీరు
ఆటోమొబైల్ రంగానికి 2018 చివరిలో చెప్పుకోదగిన ఫలితాలేమీ రాలేదు. ఆర్థిక పరమైన అనిశ్చితి, వాణిజ్య యుద్ధం.. రూపాయి మారకం విలువ.. బీమా రుసుము చెల్లింపులతో వాహనాల కొనుగోళ్లు భారంగా మారాయి. ఈ క్రమంలో డిసెంబర్ నెల మోటారు బైకులు, స్కూటర్ల విక్రయాలు మిశ్రమ ఫలితాలనిచ్చాయి.
గతేడాదితో పోలిస్తే ఆటోమొబైల్ రంగంలో 2018 డిసెంబర్ కార్ల సేల్స్‌లో డౌన్ ట్రెండ్ నమోదైంది. కానీ మోటారు సైకిళ్లు, స్కూటర్ల విభాగంలో మాత్రం మిశ్రమ ఫలితాలు లభించాయి.
పలు సంస్థల్లో అమ్మకాలు 30 శాతానికి మించి వృద్ధిరేటు నమోదు చేశాయి. మరికొన్ని కంపెనీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. సేల్స్‌లో అత్యధిక వాల్యూమ్స్‌ను నమోదు చేస్తున్న హీరో మోటోకార్ప్ దేశీ అమ్మకాలు 4 శాతం తగ్గాయి.
‘లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత, పెరిగిన ద్విచక్ర బీమా అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయి’అని హీరో మోటో కార్ప్స్ చైర్మన్ పవన్ ముంజాల్ వ్యాఖ్యానించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీ అమ్మకాలు 13 శాతం తగ్గినా.. అంతర్జాతీయ అమ్మకాలు 41 శాతం వృద్ధి చెందాయి.
ఇదే సమయంలో సుజుకీ మోటార్‌సైకిల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 33.82 శాతం, ఏప్రిల్–డిసెంబర్ కాలంలో 30 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 లక్షల యూనిట్ల విక్రయాలు జరుపాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5,45,683 యూనిట్లను విక్రయించామని ఎస్‌ఎంఐపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా అన్నారు.
మరోవైపు బజాజ్ ఆటో గతనెల మొత్తం విక్రయాలు 18 శాతం, దేశీ అమ్మకాలు 31 శాతం, ఎగుమతులు 16 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. టీవీఎస్ మోటార్ మొత్తం విక్రయాల్లో 6 శాతం, దేశీ అమ్మకాల్లో ఒక శాతం, ఎగుమతుల్లో 22 శాతం పెరిగాయి. ఈ సంస్థ స్కూటర్ విక్రయాలు 9 శాతం పెరిగి 91,480 యూనిట్లుగా నిలిచాయి.
ఫోర్డ్ అమ్మకాలు 14.8% అప్
2018 డిసెంబర్ దేశీ అమ్మకాలు 5,840 యూనిట్లుగా ఉన్నట్లు ఫోర్డ్ ఇండియా సంస్థ తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 5,087 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఏడాది ప్రాతిపదికన 14.8% వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. ఎగుమతులు 24.8 శాతం తగ్గిన కారణంగా.. గతనెల మొత్తం అమ్మకాల్లో 18 శాతం క్షీణత నమోదైనట్లు వివరించింది.