అబికో: జపాన్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఎన్‌ఈసీ కార్పొరేషన్‌ ‘ఎగిరే కారు’ను ఆవిష్కరించింది. నాలుగు ప్రొపెల్లర్లతో పెద్ద డ్రోన్‌ మాదిరిగా ఉన్న కారు దాదాపు 60 సెకన్ల పాటు స్థిరంగా గాలిలో ఎగరడం విశేషం. టోక్యోలోని ఎన్‌ఈసీ కేంద్రంలో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షలో ఈ కారు మూడు మీటర్లు (10 అడుగులు) ఎత్తుకు ఎగిరింది. ముందు జాగ్రత్తగా దీన్ని పెద్ద బోనులో నిర్వహించారు. 

ఎగిరే కార్లను అభివృద్ధి చేయడాన్ని గత కొంతకాలంగా జపాన్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2030 నాటికి ప్రజలు వీటిలో ప్రయాణించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ప్రాజెక్టులు కొన్ని నడుస్తున్నాయి. అమెరికాలో ఉబర్‌ ఎయిర్‌ ఈ కోవకు చెందినదే. 

2017లో జపాన్‌ స్టార్టప్ సంస్థ కార్టివేటర్‌ రూపొందించిన ఎగిరే కారు ప్రయోగ దశలోనే కుప్పకూలిపోయింది. ఈ ఎగిరే కార్లు చాలా దూరం ప్రయాణించగలవని కార్టివేటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫుకుజవా పేర్కొన్నారు. కార్టివేటర్‌ ఎగిరే కారుకు స్పాన్సర్‌ చేసిన 80కు పైగా కంపెనీల్లో ఎన్‌ఈసీ సైతం ఉంది. ఇది బ్యాటరీ సాయంతో నడుస్తుంది. దేశ రాజదాని టోక్యో శివారుల్లోని అబికోలో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. 

ఎన్ఈసీ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ నోరిహికో ఇషిగురో స్పందిస్తూ ఫ్లయింగ్ కార్లతో ప్రయాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవచ్చునన్నారు. సమయం వచ్చినప్పుడు మేనేజ్మెంట్ బేస్‌తో టెక్నాలజికల్ సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే బ్యాటరీ లైఫ్, సేఫ్టీ, నియంత్రణ వంటి అంశాలపై ఇంకా వర్కవుట్ చేయాల్సి ఉన్నదన్నారు.  టెక్నాలజీ చౌకగా అందుబాటులోకి వస్తే రద్దీ నగరాలు, పట్టణాల పరిధిలో రిక్రియేషనల్ ఆఫర్ రూపంలో దీన్ని అందుబాటులోకి తేవచ్చునని చెప్పారు. 

ఒకినవా విద్యుత్తు స్కూటర్ల ధరలు తగ్గింపు


విద్యుత్‌ మోటారు బైక్‌ల తయారీ సంస్థ ఒకినవా స్కూటర్స్‌ తమ ఉత్పత్తుల ధరలను రూ.8,600 వరకు తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. విద్యుత్‌ వాహనాలపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీ) 12% నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. లీడ్‌ యాసిడ్‌ శ్రేణిలోని స్కూటర్ల ధరలు రూ.2,500-4,700 మేర, లీ-అయాన్‌ శ్రేణిలోని స్కూటర్ల ధరలు రూ.3,400-8,600 తగ్గినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఒకినవా విద్యుత్‌ స్కూటర్లు రూ.37,000-1,08,000 ధరల్లో లభ్యమవుతున్నాయి.