ముకేష్ అంబానీ అల్ట్రా లగ్జరీ కార్ : దీని ధర, నంబర్ ప్లేట్ ఖరీదు, ట్యాక్స్ ఎంతో తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే
భారతదేశపు ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) రూ. 13.14 కోట్లతో రోల్స్ రాయిస్ హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేసింది. ఆర్‌టిఓ అధికారుల ప్రకారం ఈ కారు దేశంలోనే అత్యంత ఖరీదైన కార్ల కొనుగోళ్లలో ఒకటి.
భారతదేశంలో రెండవ అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ తాజాగా రూ. 13.14 కోట్ల విలువైన అల్ట్రా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ తీసుకున్న ఈ హ్యాచ్‌బ్యాక్ కారు బ్రిటిష్ విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ చెందింది. ఈ కారును సౌత్ ముంబైలోని టార్డియో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO)లో జనవరి 31న కంపెనీ రిజిస్టర్ చేయబడింది అని ఈ విషయం తెలిసిన అధికారులు తెలిపారు.
ఆర్‌టిఓ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రోల్స్ రాయిస్‌కు చెందిన కల్లినన్ మోడల్‌తో కూడిన ఈ పెట్రోల్ కారు దేశంలో ఇప్పటివరకు కొనుగోలు చేయబడిన అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి. దీనిని ముఖేష్ అంబానీ స్వయంగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. కారుకు వీఐపీ నంబర్ కూడా తీసుకున్నారు. ఈ నంబర్ 0001తో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
విశేషమేమిటంటే, ఒక వీఐపీ నంబర్ కోసం ప్రజలు నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది, కానీ ముకేష్ అంబానీ ఎంచుకున్న నంబర్ ప్రస్తుత సిరీస్‌లో అందుబాటులో లేదు. అందువల్ల, ఈ నంబర్ కోసం ఆర్‌టిఓ కొత్త సిరీస్ కూడా ప్రారంభించవచ్చు. రవాణా కమీషనర్ నుండి వ్రాతపూర్వక అనుమతితో ఆర్‌టిఓ కార్యాలయం రిజిస్ట్రేషన్ మార్క్ 0001 కేటాయించడం కోసం కొత్త సిరీస్‌ను ప్రారంభించవచ్చు, దీని కోసం దరఖాస్తుదారులు సాధారణ నంబర్‌కు పేర్కొన్న చార్జ్ కంటే మూడు రెట్లు ఎకువ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కారు ఎందుకు అంత ఖరీదు?
ఈ కారును రోల్స్ రాయిస్ 2018లో తొలిసారిగా విడుదల చేసింది. అప్పట్లో దీని ధర రూ.6.95 కోట్ల నుంచి మొదలైంది. అయితే కస్టమర్ డిమాండ్‌కు అనుగుణంగా ఈ కారులో మార్పులు చేసిన తర్వాత ధర పెరుగుతుందని ఆటో పరిశ్రమ నిపుణులు అంటున్నారు. 2.5 టన్నులకు పైగా బరువున్న ఈ 12 సిలిండర్ల కారు 564 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ముకేష్ అంబానీ ఈ కారు కోసం 'టుస్కాన్ సన్' రంగును ఎంచుకున్నారు.
ఈ కారు కోసం ఎంత పన్ను చెల్లించాలి?
ఈ లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ కోసం రిలయన్స్ అధినేత ఏకంగా రూ.20 లక్షల పన్ను చెల్లించారు. దీని రిజిస్ట్రేషన్ 30 జనవరి 2037 వరకు చెల్లుబాటు అవుతుంది. దీంతో పాటు రోడ్డు భద్రత పన్ను కింద రూ.40 వేలు కూడా చెల్లించారు. రోల్స్ రాయిస్ ఈ వాహన మోడల్ మరికొందరు పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఉంది. మరోవైపు, రిలయన్స్ కంపెనీ ఫ్లీట్‌లో ఇప్పటికే చాలా ఖరీదైన వాహనాలు చేర్చబడ్డాయి. మోరిస్ గ్యారేజ్ గ్లోస్టర్ మోడల్‌కు చెందిన సరికొత్త హై-ఎండ్ కార్లతో పాటు అంబానీ కుటుంబ భద్రత కోసం మోహరించిన పోలీసు సిబ్బంది కోసం కంపెనీ బిఎమ్‌డబ్ల్యూని కూడా ఇచ్చింది.