న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్ మార్కెట్లోకి ప్రీమియం ఎస్‌యూవీ జీఎల్‌సీ మోడల్ కారును తీసుకువచ్చింది. మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్‌ షువెంక్‌ ఈ కారును మార్కెట్లోకి విడుదల చేశారు. బీఎస్‌ -6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ ఎస్‌యూవీ మోడల్ కారు ప్రారంభ ధర రూ.52.56 లక్షలుగా నిర్ణయించారు. ఈ సరికొత్త జెనరేషన్‌ జీఎల్‌సీ కారు పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుందని మెర్సిడెస్‌ తెలిపింది.

జీఎల్‌సీ 200 పెట్రోల్‌ వెర్షన్‌ కారు ధర రూ.52.75 లక్షలుండగా డీజిల్‌ వేరియంట్‌ జీఎల్‌సీ 220డీ ధర రూ.57.75 లక్షలకు వినియోగదారులకు లభిస్తుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో జీఎల్‌సీ ఒకటని, ఇప్పటి వరకు 7,000 యూనిట్లను విక్రయించినట్లు మార్టిన్‌ తెలిపారు.

also read మారుతి ‘ధరల’ బాంబు: వచ్చే ఏడాది నుంచి కార్లు మరింత భారం

తొలుత దీన్ని 2019 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్.. ఈ కారులో పలు మార్పులు చేర్చారు. సరికొత్త ఎంబక్స్ ఇంటర్ ఫేజ్ సిస్టమ్‌తో విపణిలో అడుగు పెట్టిన కారు ఇదే. ఈ ఎస్‌యూవీ కారును జీఎల్సీ 200, జీఎల్సీ 220డీ 4 మాటిక్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చారు.

ఈ కారు ముందుభాగంలో సరికొత్త గ్రిల్, సిల్వర్ ఇన్సెర్ట్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. వెనుక టెయిల్ ల్యాంప్‌ల్లోనూ మార్పులు చేశారు. ఈ కారు ఇప్పుడు 17 అంగుళాల నుంచి 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. పూర్తి నలుపు రంగుతో పూర్తిగా ఇంటిరియర్ డిజైన్ నింపేశారు. 

also read టాటా సరి కొత్త పంథా.. త్వరలోనే మార్కెట్‌లోకి...

సరికొత్త ఎంబక్స్ సిస్టమ్‌లో డిజిటల్ ఇనుస్ట్రుమెంట్స్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్, టచ్ స్క్రీన్ యూనిట్, భారీ టచ్ ప్యాడ్, సెంట్రల్ కన్సోల్‌లో అన్ని కంట్రోల్స్ వాడుకునే వీలు కల్పించారు. దీనిలో స్టీరింగ్‌పై టచ్ సెన్సిటివ్ బటన్లను కూడా అమర్చారు.

ఈ కారులో కంపెనీ తయారు చేసిన జనరేషన్ 4 సిలిండర్ బీఎస్-6 పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను అమర్చారు. పెట్రోల్ వేరియంట్ కారుకు ఎం264 2.0 లీటర్ల ఇంజిన్ అమరిస్తే ఇది 194 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. డీజిల్ వేరియంట్ కారుకు ఓఎం651 2.0 లీటర్ల నాలుగు సిలిండర్ల ఇంజిన్ అమర్చారు. ఇది 192 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. రెండు ఇంజిన్లకు 9జీ-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌ను జత కలిపారు.