న్యూఢిల్లీ: ప్రజలందరి అభిరుచికి తగినట్లు, జీవనశైలికి అనుగుణంగా, అన్ని వర్గాల వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల డిజైన్లతో తయారుచేసిన మోడల్ కార్లను మార్కెట్‌లోకి ప్రవేశం పెట్టడమే లక్ష్యమని మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) పేర్కొంది. మార్కెట్‌లో ప్రతి కొనుగోలు దారుడు, వినియోగదారుడికి దగ్గరవ్వాలనే దిశగానే మారుతీ సుజుకి ఎళ్లవేళలా అడుగులు వేస్తుందని, ఏ ఒక్క సెగ్మెంట్‌నూ  విస్మరించబోమని ఆ సంస్థ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌ఎస్ కల్సీ చెప్పారు. 

అన్ని రకాల బాడీ డిజైన్లు గల కార్లను మార్కెట్లో విడుదల చేయడానికి ఎంఎస్ఐ వ్యూహరచన చేసింది. ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల వాహనాల విభాగంలో మారుతి 50 శాతం పైబడి వాటా కలిగి ఉంది. మార్కెట్‌ దిశ క్రమంగా ప్రీమియం మోడళ్ల దిశగా మారుతుండటంతో అన్ని రకాల మోడళ్లలో మరిన్ని మెరుగైన ఫీచర్లు ప్రవేశపెట్టడంపైనే దృష్టి సారించనున్నది. అన్ని రకాల జీవన శ్రేణులు, అన్ని రకాల ఆశలు గల కస్టమర్లను ఆకర్షించడమే మారుతి సుజుకి లక్ష్యం. జనాభాలో ప్రతి ఒక్క విభాగానికి అవసరమైన కార్లను సిద్ధం చేయడమే లక్ష్యమని మారుతి సుజుకి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ కల్సీ పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ తెలిపారు. ప్యాసింజర్ వాహన విక్రయాల్లో టాప్-10 మోడల్స్‌లో మొదటి ఆరు, ఏడు కార్లు మారుతి సుజుకి సంస్థకు చెందినవే. 

ఈ క్రమంలో మున్ముందు మరిన్ని ఆకర్షణీయ మోడల్స్ మారుతీ నుంచి మార్కెట్‌లోకి విడుదలవుతాయని మారుతి సుజుకి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ కల్సీ తెలిపారు. హాచ్‌బ్యాక్స్, సెడాన్స్, ఎస్‌యూవీ తదితర విభాగాల్లో సరికొత్త మోడళ్లను పరిచయం చేయడమే సంస్థ వ్యూహమన్నారు. అన్ని వర్గాల వారి ఆర్థిక స్థోమతకు సరిపోయే కార్లను తాము మార్కెట్‌లో విక్రయిస్తున్నామని, ఇక ముందూ ఇలాగే కొనసాగుతామని చెప్పారు. విటారా బ్రెజ్జా మార్కెట్‌కు సంబంధించిన కొన్ని కీలకాంశాలు తమ దృష్టికి తెచ్చిందంటూ కస్టమర్ల ఆశలకు అనుగుణంగా స్పందించేందుకు ఇది చక్కని అవకాశంగా నిలిచిందని ఆయన అన్నారు. 

తమ వినియోగదారుల ప్రొఫైల్స్‌లో ఆర్థికంగా మార్పు వస్తున్నదని, కారు పనితీరులో ఎటువంటి రాజీ లేని ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆర్ఎస్ కల్సీ తెలిపారు. తమ సంస్థ పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామాలపైనా ద్రుష్టిని కేంద్రీకరించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాల్లో డబుల్ డిజిట్ నమోదు చేయాలని లక్ష్యంతో సాగుతున్నదన్నారు. నూతన డీలర్లను నియమించుకుని నెట్ వర్క్ విస్తరణ దిశగా తమ ప్రయాణం సాగుతున్నదన్నారు.

ఏ ఒక్క విభాగాన్నో లక్ష్యంగా చేసుకుని తమ అమ్మకాలు సాగబోవని మారుతి సుజుకి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ కల్సి స్పష్టం చేశారు. ఇక 2020 నాటికి వార్షిక అమ్మకాలను 20 లక్షలుగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఈ లక్ష్యసాధనలో భాగంగా 20 కొత్త మోడళ్ల కార్లను మార్కెట్‌లోకి తేనున్నామని చెప్పారు. ఈ తొలి త్రైమాసికంలో 4,90,479 యూనిట్లను విక్రయించిన మారుతి.. గత ఆర్థిక సంవత్సరం (2017-18) మొత్తం 16,53,500 కార్లను అమ్మింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2016-17)తో పోల్చితే ఇది 14.5 శాతం అధికం. దేశీయ మార్కెట్‌లో 25.9 శాతం వృద్ధిరేటుతో మారుతీ దూసుకెళ్తున్నది.

కార్లలో ప్రీమియం ఫీచర్లు ప్రవేశపెట్టడంపై కూడా దృష్టి సారిస్తామన్నారు. హ్యాచ్‌బాక్‌లు, సెడాన్లు, ఎస్‌యువిలు అన్ని రకాల మోడళ్లు తమ అభివృద్ధికి కీలకంగానే భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఏ ఒక్క విభాగాన్ని నిర్లక్ష్యం చేసేది లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆదాయం, జీవనశైలి ఇటీవల కాలంలో ఎంతో మార్పు వచ్చిందని, కార్ల పనితీరుకు సంబంధించిన ఎలాంటి అంశాల్లోను రాజీ పడే ఆలోచన వారికి లేదని కల్సి చెప్పారు.
 
తక్కువ ధరల శ్రేణిలో కారు పేరుతో ఒక డబ్బాను అందించడాన్ని కస్టమర్లు ఇష్టపడడంలేదని, అందుకే ఎంట్రీ స్థాయి కార్లలో కూడా సరికొత్త ఆకర్షణలు ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్యన ఎలాంటి వివక్ష లేకుండా అన్ని మార్కెట్లకు నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని కల్సి చెప్పారు.