మేజర్ అయినా తిప్పలు!! ప్రొడక్షన్ తగ్గించిన ‘మారుతి’
మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు.. ముంగిట్లో సార్వత్రిక ఎన్నికలు.. దేశీయంగా విక్రయాలు తగ్గిన నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ మేజర్ మారుతి సుజుకి ఫిబ్రవరి నెలలో రమారమీ 8.4 శాతం కార్ల ఉత్పత్తిని తగ్గించింది. ఈ సంగతి స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేయడంతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌లో 2.56 శాతం నష్టపోయింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీకి కూడా తిప్పలు తప్పడం లేదు. వాహనాలకు డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటంతో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఉత్పత్తిని తగ్గించింది. ఫిబ్రవరిలో వాహనాల తయారీలో ఎనిమిది శాతానికి పైగా కోత విధించింది.
సూపర్ క్యారీ ఎల్‌సీవీతోపాటు 1,48,959 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తైన 1,62,524 యూనిట్లతో పోలిస్తే 8.3 శాతం తగ్గాయని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.
ఆల్టో, స్విఫ్ట్, విటారా బ్రెజా తదితర ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 8.4 శాతం తగ్గింది. గత ఫిబ్రవరిలో 1,61,116 యూనిట్లతో పోలిస్తే 1,47,550 యూనిట్లకు క్షీణించింది.
ఈకో, ఆమ్ని వంటి వ్యాన్స్ విభాగం ఉత్పత్తి 13,827 యూనిట్ల నుంచి 22.1 శాతం వృద్ధితో 16,898 యూనిట్లకు పెరిగింది. సూపర్ క్యారీ ఎల్‌సీవీ తయారీ ఒక్క యూనిట్ మేర పెరిగింది.
కానీ, మారుతి సుజుకి కంపెనీ వ్యాన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో 16,898 యూనిట్లను ఉత్పత్తి చేసింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 22.1 శాతం పెరిగాయి. దీనిపై మారుతి సుజుకి ఇండియా ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు.
జనవరిలో కంపెనీ1,83,064 యూనిట్ల కార్లను మారుతి సుజుకి ఉత్పత్తి చేసింది. జనవరి 2018లో ఉత్పత్తి చేసిన 1,58,396లతో పోలిస్తే 15.6 శాతం పెరుగుదల కనిపించింది. గత నెలలో మారుతి సుజుకి కంపెనీ విక్రయాలు 0.9 శాతం తగ్గి 1,39,100 యూనిట్లకు పరిమితం కాగా, జనవరిలో 1.1 శాతం పెరిగాయి.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటం, మరోవైపు వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయిలో ఉండటం, చమురు ధరలు పెరుగుతుండటంతో కార్లను కొనుగోలు చేయడానికి కస్టమర్లు జంకుతున్నారు. దీంతో దేశీయంగా ప్యాసింజర్ వాహన అమ్మకాలు 8 శాతానికి పైగా పడిపోయాయి.
గుర్గావ్, మానెసర్‌లలో ఉన్న ప్లాంట్ల ద్వారా ప్రతియేటా సంస్థ 15.5 లక్షల యూనిట్ల కార్లను మారుతి సుజుకి ఉత్పత్తి చేస్తున్నది. గుజరాత్‌లోని హన్స్‌లాపూర్ వద్ద సుజుకీ ఏర్పాటు చేసిన యూనిట్‌లో 2.5 లక్షలు ఉత్పత్తి అవుతున్నాయి.
ఉత్పత్తి తగ్గించినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు మారుతి సుజుకి తెలియజేయడంతో స్టాక్ మార్కెట్లో కంపెనీ షేరు భారీగా పడిపోయింది. ఇంట్రాడేలో 4.39 శాతం నష్టపోయిన కంపెనీ షేరు ధర..చివరకు 2.56 శాతం నష్టంతో .6,910.35 వద్ద ముగిసింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ 2.56 శాతం తగ్గి రూ.6,902 వద్ద స్థిరపడింది.