ముంబై: దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ భారత్లో విడుదల చేస్తున్న తొలి కాంపాక్ట్ ఎస్యూవీ ‘కియా సెల్టోస్’. బుకింగ్స్ ప్రారంభించిన రోజే వినియోగదారుల నుంచి దానికి అనూహ్య స్పందన వచ్చింది. 

తొలిరోజే రికార్డు స్థాయిలో 6,046 ఆర్డర్లు లభించడం విశేషం. ఆగస్టు 22న మార్కెట్లో ఆవిష్కరించనున్న సెల్టోస్ కారు కోసం ముందుగా రూ.25 వేలు చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు తొలి వారంలో ఈ కార్లు షోరూమ్‌లను చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. 

ఊహించని రీతిలో వచ్చిన స్పందనకు కియామోటార్స్ ఆనందం వ్యక్తం చేసింది. కంపెనీ వెబ్ సైట్ ద్వారా 1,628, నగరాల్లోని డీలర్ షిప్‌ల ద్వారా మిగతా ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.

కియా మోటార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ మనోహర్ భట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘దేశంలోని 160 నగరాల్లో వినియోగదారుల నుంచి ఊహించని రీతిలో స్పందన లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదో అద్భుత ఘనత. భారతదేశంలో కియా బ్రాండ్ గుర్తింపునకు ఇదో చిహ్నం. మేం చేసిన ప్రచారం వల్ల మా బ్రాండ్‌ను వినియోగదారులు అంగీకరించారు. మా మధ్యరకం ఎస్ యూవీ సెల్టోస్ బీఎస్-6 కంపాటబిలిటీతో వస్తోంది’ అని తెలిపారు. 

‘పెట్రోల్, డీజిల్ వేరియెంట్లు అందుబాటులో ఉంటాయి. ఆటోమేటిక్, మాన్యువల్ విధానాల్లో వాహనం తేవడం ఈ సెగ్మెంట్లో ఆకర్షణీయంగా మార్చింది. మా ఆధునిక తయారీ ప్లాంట్‌కు మూడు లక్షల వాహన తయారీ సామర్థ్యం ఉంది. అనుకున్న సమయంలోపు వాహనాలను డెలివరీ చేసి వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’ అని కియా మోటార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ మనోహర్ భట్ తెలిపారు.