ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజ హ్యుండాయ్  ప్రతిష్టాత్మకంగా విపణిలోకి తెచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘కోనా’ ధర భారీగా తగ్గనున్నది.  దీనికి జీఎస్టీ తగ్గనుండడమే కారణం. ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్‌ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఎలక్ట్రిక్ కార్లపై జీఎస్టీ తగ్గించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. 

ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రస్తుతం జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన అమలులోకి వస్తే హ్యుండాయ్‌ కోనా కారు ధర రూ. 1.50 లక్షల మేర తగ్గనుంది. కాలుష్య నివారించడానికి, ఇంధన వాడకం నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సాహిస్తోంది. 

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల మీద ఉన్న జీఎస్టీని తగ్గించే ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విద్యుత్ కార్లపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ మండలి కోరినట్లు తెలిపిన సంగతి తెలిసిందే.

హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ ధర రూ.25.3(ఎక్స్‌ షోరూం ధర)  ఆర్థికమంత్రి ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం లభిస్తే.. కోనా ధర రూ. 23.8 లక్షలకు తగ్గనున్నది. ఇంకా ఈ కారును కొన్న కస్టమర్లకు కేంద్రం ద్వారా మరో శుభవార్తనూ అందించింది. 

ప్రతి కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలు సందర్బంగా వాహనరుణంపై వడ్డీ రాయితీ, ఆదాయం పన్ను రాయితీ కలిపి  రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనాలను అందించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం రూ.3 లక్షల  తగ్గింపుతో  కోనా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. 

కాగా చెన్నైలోని హ్యుండాయ్‌ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ అయిన ఈ కారులో ఆరు ఎయిర్‌ బ్యాగులు, యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌–ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్, బ్యాకప్ కెమెరా ఉన్నాయి.  

39.2 కిలోల వాట్స్‌ సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ, 136 బీహెచ్పీ గరిష్ట పవర్ 395ఎన్ఎం టార్చ తదితర ఫీచర్లు ఉన్నాయి. కేవలం 9.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోగల హ్యుండాయ్ కోనా ఒక్కసారి ఛార్జింగ్‌తో 452 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని  లాంచింగ్‌ సమయంలో   హ్యుండాయ్‌ వెల్లడించింది.