న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్‌ మోటార్స్‌ విపణిలోకి సరికొత్త ‘ఐ10 నియోస్‌’ మోడల్ కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.99 లక్షల వరకు  నిర్ణయించారు. పెట్రోల్‌ వేరియంట్‌ కారు ప్రారంభ ధర రూ.4.99లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.70 లక్షలుగా ఉంది. దీనిలో టాప్‌ఎండ్‌ ధర రూ.7.99లక్షలు ఉంటుంది.

ఇదే మోడల్‌ కారును హ్యుండాయ్ త్వరలోనే యూరప్‌ మార్కెట్లో కూడా విడుదల చేయనున్నది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ను హ్యుండాయ్‌ స్వీకరిస్తోంది. ప్రస్తుత మోడల్‌ గ్రాండ్‌ ఐ10తోపాటు సరికొత్త మోడల్‌ కూడా మార్కెట్లో అందుబాటులోకి ఉంటుంది. 

భారత్‌ వినియోగదారుల అవసరాలకు తగినట్లు ఈ కారును డిజైన్‌ చేసినట్లు హ్యుండాయ్ పేర్కొంది. వీటిల్లో ఫీచర్లను బట్టి ఎరా, మాగ్నా, స్పోర్ట్స్‌, ఆస్టా మోడళ్లు ఉన్నాయి. ఈ కారులో సరికొత్త హెడ్‌ల్యాంప్స్‌, ప్రొజెక్టర్‌ ల్యాంప్స్‌ ఉన్నాయి. ఫ్రంట్‌ గ్రిల్‌ ఆకారం కూడా సరికొత్తగా ఉంది. 

ఐ10 నియోస్ ఇంటీరియర్‌ను కూడా పూర్తిగా మార్చేసింది హ్యుండాయ్ యాజమాన్యం. డ్యాష్‌బోర్డులో సరికొత్త 8అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ అందుబాటులో ఉంది. దీనికి స్మార్ట్‌ ఫోన్లను కూడా అనుసంధానించుకోవచ్చు. ఇక స్టీరింగ్‌, ఏసీ వెంట్స్‌ను వెన్యూమోడల్‌ నుంచి తీసుకొచ్చి వినియోగిస్తున్నారు. వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, రియర్‌ ఏసీ సౌకర్యాలను కల్పించింది. 

ఈ కారులో కూడా 1.2 డీజిల్‌, పెట్రోల్‌ ఇంజిన్లనే హ్యుండాయ్‌ కొనసాగించింది. పెట్రోల్‌ ఇంజిన్‌ 82 బీహెచ్‌పీ, డీజిల్‌ ఇంజిన్‌ 74బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తాయి. రెండింట్లోనూ 5-స్పీడ్‌ మ్యాన్యూవల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్లను అమర్చింది. 

పెట్రోల్‌ మాన్యూవల్‌ లీటర్‌కు 20.7కిలోమీటర్లు, ఆటోమేటిక్‌ 20.2 కిలోమీటర్ల మేరకు మైలేజీ ఇస్తుంది. డీజిల్‌ రకంలో రెండు వేరియంట్లు 26.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. ఈ సరికొత్త కారు మొత్తం ఆరు రంగుల్లో లభిస్తుంది. డ్యూయల్‌ టోన్‌ ఆప్షన్‌ కూడా హ్యుందాయ్‌ కల్పించింది.