న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా రెండోతరం క్రెటా కారును వచ్చేనెల 17న విపణిలో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. 2020 హ్యుండాయ్ క్రెటా కారు పూర్తిగా బీఎస్ -6 ప్రమాణాలతో కూడిన పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో రూపుదిద్దుకున్నది. 

అయితే బీఎస్-6 ప్రమాణాలతో కూడిన క్రెట్టా మార్కెట్లో అడుగు పెట్టడానికి ముందు బీఎస్-4 క్రెట్టాపై హ్యుండాయ్ మోటార్స్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. తొలితరం హ్యుండాయ్ క్రెట్టా ధర రూ.10 లక్షల నుంచి రూ.15.72 లక్షల మధ్య పలుకుతోంది. 

ఈ ఎస్‌యూవీ కారు బీఎస్-4 ఇంజిన్ చాయిస్‌లతో వినియోగ దారులకు అందుబాటులో ఉంది. 1.6 లీటర్ల వీటీవీటీ పెట్రోల్, 1.6 లీటర్ల సీఆర్డీఐ డీజిల్, 1.4 లీటర్ల సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లబిస్తుంది. హ్యుండాయ్ క్రెట్టా పెట్రోల్, డీజిల్ వేరియంట్ కార్లపై రూ.1.15 లక్షల వరకు రాయితీలు అందిస్తోంది. 

రెండోతరం హ్యుండాయ్ క్రెట్టా ఈ నెల ఆరో తేదీన న్యూఢిల్లీ సమీపాన జరిగిన ఆటో ఎక్స్ పోలో హ్యుండాయ్ ఆవిష్కరించింది. కారులో ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ రూపేణా అద్భుతమైన మార్పులు తెచ్చింది.

3డీ కాస్కేడింగ్ గ్రిల్లె, ట్రిపుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, బూమరాంగ్ షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఎల్ఈడీ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 2020 క్రెట్టా కారు న్యూ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్ తదితర ఫీచర్లు కలిగి ఉంది. హ్యుండాయ్ క్రెట్టా బీఎస్-4 కారుతోపాటు మిగతా బీఎస్-4 హ్యుండాయ్ మోడల్ కార్లపై నగదు రాయితీలు కల్పిస్తోంది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం... 

హ్యుండాయ్ ఎలంట్రా (పెట్రోల్/డీజిల్) కారు కొనుగోలుపై రూ. 2.50 లక్షల వరకు, హ్యుండాయ్ టస్కన్ (పెట్రోల్/డీజిల్) కారు కొనుగోలుపై రూ. 2.50 లక్షల వరకు రాయితీ అందిస్తోంది. 

హ్యుండాయ్ వెర్నా (పెట్రోల్/డీజిల్) కారు కొనుగోలుపై రూ. 90 వేల వరకు, హ్యుండాయ్ ఐ20 (పెట్రోల్/డీజిల్) కారు కొనుగోలుపై రూ. 65 వేల వరకు రాయితీ అందుబాటులో ఉంది. హ్యుండాయ్ ఎక్స్ టెంట్ (పెట్రోల్/డీజిల్) కారు కొనుగోలుపై రూ.95 వేల వరకు, హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (డీజిల్) కారు కొనుగోలుపై రూ. 55 వేల వరకు రాయితీ పొందొచ్చు.

హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 (పెట్రోల్/డీజిల్) కారు కొనుగోలుపై రూ. 75 వేల వరకు, హ్యుండాయ్ శాంట్రో (పెట్రోల్) కారు కొనుగోలుపై రూ. 55 వేల వరకు రాయితీని పొందొచ్చు.