Honda City e:HEV: హోండా నుంచి హైబ్రిడ్ వెర్షన్ కార్.. దీని ప్రత్యేకతే వేరు..!
హోండా సిటీ పూర్తి హైబ్రిడ్ వెర్షన్ కార్ e:HEV భారత మార్కెట్లో విడుదలైంది. దీనిలోని ప్రత్యేకతలు, ఫీచర్లు ఇంకా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
హోండా కార్స్ ఇండియా తమ బ్రాండ్ నుంచి హోండా సిటీ సెడాన్ మోడల్ కార్లలో స్వచ్ఛమైన హైబ్రిడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది హోండా సిటీ e:HEV పేరుతో అన్ని సదుపాయాలు, సౌకర్యాలతో ఏకైక టాప్-ఎండ్ ZX వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే కొనసాగుతున్నాయి, డెలివరీలు కూడా వెంటనే ప్రారంభించనున్నారు.
సిటీ e:HEV హైబ్రిడ్ ఒక ప్రత్యేకమైన వాహనం ఇది పెట్రోల్ లేదా బ్యాటరీ శక్తితో పనిచేస్తుంది. ఇందులో 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్‌ని అమర్చారు. ఈ ఇంజన్‌ను రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో అటాచ్ చేశారు. ఈ క్రమంలో మొదటి మోటారు ఎలక్ట్రిక్ జనరేటర్‌గా పనిచేస్తే, మరొకటి ప్రొపల్షన్ సాధనంగా పనితీరును చూపిస్తుంది. ఈ రకమైన అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌తో హోండా సిటీ e:HEV 26.5kpl మైలేజ్ అలాగే 1000km పరిధిని అందిస్తుంది.
ఈ హైబ్రిడ్ హోండా కార్ ఇంజన్ eCVT ట్రాన్స్‌మిషన్, బూట్‌లో అమర్చిన బ్యాటరీ ప్యాక్‌తో జతచేయడంతో ఈ కార్ స్టార్ట్ చేసినపుడు 'ఎలక్ట్రిక్-ఓన్లీ మోడ్' కు ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 126hp శక్తి వద్ద 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హోండా సిటీ e:HEV ఫీచర్లు, ధర
ఈ కారులోని ఫీచర్లను పరిశీలిస్తే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. కాబట్టి సేఫ్టీ ఫీచర్లు ఎక్కువ ఉంటాయి. ఆటో-హోల్డ్ ఫంక్షన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ వాచ్ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. టెలిమాటిక్స్ పరంగా, హోండా కనెక్ట్ ఇప్పుడు అలెక్సా ఇంకా గూగుల్‌కి సపోర్ట్ చేస్తుంది. రిమోట్ ఇంజిన్ స్టార్ట్, డోర్ లాక్/అన్‌లాక్, AC ఆన్/ఆఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. హోండా సిటీ e:HEV హైబ్రిడ్ కార్ ధర ఎక్స్-షోరూమ్, ఢిల్లీలో రూ. 19,50 లక్షలుగా ఉంది.
హైబ్రిడ్ వాహనం అంటే
హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం (HEV)లో ఎలక్ట్రిక్ ఇంజిన్ అలాగే సాంప్రదాయమైన ఇంధన ఇంజన్ రెండింటినీ ఉపయోగించే ఒక ప్రత్యేకమైన వాహనం. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ వాహనాన్ని నడిపిస్తుంది, ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది.